
అభివృద్ధి పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు
డోన్: కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని విస్మరిస్తుందని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఇంకెప్పుడు పూర్తి చేస్తారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కొత్తకోట గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన రూ. 18.50 కోట్లతో నిర్మిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసర్చ్ (ఐడీటీఆర్) భవనంతో పాటు దేవరబండ, వెంగళాంపల్లి చెరువులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సకాలంలో హంద్రీ నీవా కాలువ నుంచి నీరు అందించలేక పోయిన ఘనత కూటమి ప్రభత్వానికే దక్కుతుందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలకు తాగేందుకు మంచి నీరు, పశువులకు నీరు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రారంభించిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మాజీ మంత్రి వెంట మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రామచంద్రుడు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, పార్టీ మండల అద్యక్షులు సోమేశ్ యాదవ్, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి