
మల్లన్న ‘స్పర్శ’ భాగ్యం .. సామాన్యులకు దూరం
శ్రీశైలంటెంపుల్: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీశైల క్షేత్రంలో మాత్రమే జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారికి తలను తాకించి స్పర్శదర్శనం చేసుకునే భాగ్యం ఉంది. ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఆరాటపడతారు. అయితే స్పర్శ దర్శనం టిక్కెటు రుసుం రూ.500గా దేవస్థానం నిర్ణయించింది. స్పర్శదర్శనం టికెట్టు పూర్తిగా ఆన్‌లైన్‌లో తీసుకోవాలి. మల్లన్న దర్శనానికి వచ్చే పేద, సామాన్య భక్తులకు ఆర్థిక భారంతో పాటు అవగాహన లేకపోవడంతో స్పర్శ దర్శనానికి నోచుకోలేక పోతున్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని గతంలో దేవస్థానం వారంలో నాలుగు రోజుల పాటు ఉచిత స్పర్శ దర్శన భాగ్యం కల్పించింది. భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శని, ఆది, సోమవారాల్లో అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రద్దీ రోజులు కాకుండా ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు రెండు పూటలా మల్లన్న స్పర్శదర్శనానికి సమయాన్ని కేటాయించారు. ఈమేరకు మధ్యాహ్నం 1.30 నుంచి 2.30గంటల వరకు అవకాశం కల్పిస్తూ 2022 కార్తీక మాసం నుంచి ప్రారంభించారు. అనంతరం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని అప్పటి దేవస్థాన కార్యనిర్వహణాధికారి మంగళవారం నుంచి సాయంత్రం వేళలలో కూడా 6.30 నుంచి 7.30 గంటల వరకు ఒక గంట పాటు సామాన్య భక్తులకు మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. ఆ తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండు గంటల పాటు భక్తులకు ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. భక్తులు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి క్యూలైన్లలో ఉన్నవారికి ఈ అవకాశం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మల్లన్నను ఉచితంగా స్పర్శదర్శనం చేసుకుని తరించేవారు.
కమిషనర్‌తో చర్చించి
నిర్ణయం తీసుకుంటాం
శ్రీశైల దేవస్థానంలో గతంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం మల్లికార్జునస్వామివారి ఉచిత స్పర్శదర్శనం కల్పించారు. కాలక్రమేణా క్షేత్రానికి భక్తుల రద్దీ పెరగడంతో ఉచిత స్పర్శదర్శనాన్ని అమలు చేయడం లేదు. భక్తుల నుంచి ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విషయంపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, వారి సూచనలతో ఉచిత స్పర్శదర్శనంపై తదుపరి చర్యలు తీసుకుంటాం.– ఎం.శ్రీనివాసరావు,
శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి
ఉచిత స్పర్శదర్శనానికి మంగళం..
గతంలో నాలుగు రోజుల పాటు
ఉచితంగా స్పర్శదర్శనం
కొన్ని నెలలుగా ఉచిత స్పర్శదర్శనం
నిలిపివేసిన దేవస్థానం
పునరుద్ధరించాలని కోరుతున్న భక్తులు
గత కొన్ని నెలల నుంచి మల్లన్న ఉచిత స్పర్శదర్శనానికి దేవస్థాన అధికారులు మంగళం పలికారు. భక్తు ల రద్దీ పేరుతో ఉచిత మల్లన్న స్పర్శదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే సామాన్య భక్తులు, డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో టికెట్టు పొందే స్థోమత లేని పేద భక్తులు నిరాశతో దూర దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇప్పటికైన దేవస్థాన అధికారులు స్పందించి మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని కొనసాగించాలని, గతంలో మాదిరి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ దర్శన సౌకర్యం కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

మల్లన్న ‘స్పర్శ’ భాగ్యం .. సామాన్యులకు దూరం