సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

Jul 9 2024 12:18 AM | Updated on Jul 9 2024 12:18 AM

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని, వీలైనంతత్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుని, విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులే అధికంగా వస్తున్నాయని, క్షేత్రస్థాయిలో వీఆర్‌ఓ, మండల స్థాయి వ్యవస్థ సరిగా పనిచేయడం లేదనే విషయం వ్యక్తమవుతోందన్నారు. పనితీరు మెరుగుపరచుకోవాలని అధికారులకు సూచించారు. కాగా జిల్లావ్యాప్తంగా 123 దరఖాస్తులు అందినట్లు జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

అధికారులు సమయపాలన పాటించండి

సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆమె జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాను అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షించి, ఆపై క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకుంటానన్నారు. ఫైళ్లను ఈ– ఆఫీస్‌ ద్వారానే పరిశీలించి క్లియర్‌ చేస్తానని, కింది స్థాయి గుమాస్తా నుంచి పైస్థాయి అధికారి వరకు ఈ సైన్‌తోనే ఫైల్‌ పంపాలని సూచించారు. కోర్టు కేసులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికివారు తమ కార్యాలయాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పత్రికలలో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా సంబంధిత పత్రికలకు వివరణలను చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇతర సమస్యలు పరిష్కరించడంలో తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. అధికారులు సెలవులో వెళ్లాల్సివస్తే మూడు రోజులు ముందుగానే అనుమతి తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement