టీడీపీలో భూ బకాసురులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో భూ బకాసురులు

Apr 2 2024 12:30 AM | Updated on Apr 2 2024 11:34 AM

- - Sakshi

సాక్షి, నంద్యాల: తెలుగుదేశం పార్టీ నేతలు భూబకాసురుల అవతారం ఎత్తారు. భూమి కనిపిస్తే చాలు కబ్జాకు పాల్పడుతున్నారు. వీరి ఆగడాలు పక్క రాష్ట్రం తెలంగాణకు చేరాయి. దర్జాగా ల్యాండ్‌ కబ్జాలు, సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడుతూ రాష్ట్ర పరువు తీస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా వీరి దందాలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి. సెటిల్‌మెంట్ల పేరుతో భూములను తక్కువ ధరలకు కాజేస్తూ రూ. కోట్లు సంపాదిస్తున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ 2021లో హైదరాబాద్‌లో ఏకంగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి సమీప బంధువు ప్రవీణ్‌ రావును కిడ్నాప్‌ చేయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో రూ.వందల కోట్ల విలువైన ల్యాండ్‌ వివాదం సెటిల్‌మెంట్‌కు దారి తీసింది. సెటిల్‌మెంట్‌కు ప్రవీణ్‌ రావు ఒప్పుకోకపోతే ఆయన్ను అఖిలప్రియ కిడ్నాప్‌నకు యత్నించారు. ఈ కేసులో అఖిలప్రియను ఏ1గా, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ను ఏ3గా గుర్తించారు. ఇదే కేసు విషయమై అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ కూడా చేశారు. అలాగే ఈ కేసులో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. గతేడాది మే నెలలో నంద్యాలలో నారా లోకేశ్‌ నిర్వహించిన యువగళం పాదయాత్రలో కొత్తపల్లి వద్ద సొంత పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపైనే మాజీ మంత్రి అఖిలప్రియ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏవీ సుబ్బారెడ్డి గాయపడ్డారు. ఈ ఘటనలోనూ అఖిలప్రియపై కేసు నమోదైంది. ఇలా భూ కబ్జాలు, కిడ్నాప్‌లు, దాడులు టీడీపీ నేతలకు పరిపాటిగా మారాయి.

అసైన్డ్‌ భూముల కేసులో మాండ్ర....
టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాండ్ర శివానందరెడ్డి కూడా భూ కబ్జా కేసు ఇరుక్కునట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు టీడీపీ తరఫున నంద్యాల ఎంపీ టికెట్‌ తనకే అంటూ ప్రచారం కూడా చేసుకున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఆయన ప్రధాన అనుచరుడికే ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న సమయంలో భారీగా భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో కబ్జా చేసిన భూములు ఇప్పుడు రూ. వేల కోట్లు పలుకుతున్నాయి.

హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన బుద్వేల్‌లో దాదాపు 29 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఆయన కబ్జా చేశారన్నది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఈ భూముల విలువ రూ.2 వేల కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. ఈ భూములను ఆయన తన భార్య, ఇతర బంధువుల పేర్ల మీద ఉన్నట్లు సమాచారం. ఇదే కేసు విషయమై సోమవారం తెలంగాణ సీసీఎస్‌ పోలీసులు నందికొట్కూరుకు చేరుకున్నారు. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలోని మాండ్ర స్వగృహానికి తెలంగాణ సీసీఎస్‌ పోలీసులు చేరుకుని.. అసైన్డ్‌ ల్యాండ్‌ కబ్జా విషయమై తాము చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని కోరారు. కానీ, పోలీసుల కళ్లుగప్పి మాండ్ర తప్పించుకుని పారిపోయారు.

భయపడుతున్న జిల్లా వాసులు..
తెలుగుదేశం పార్టీ నేతల భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు విన్న ప్రతి సారి జిల్లా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో వీరు చేసిన అరాచకాలను తలుచుకుని ఇప్పటికీ భయపడుతున్నారు. అధికారంలో లేకపోయినా కబ్జాలకు పాల్పడుతుంటే.. మళ్లీ వీరికి అధికారం అప్పగిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలుచుకుంటేనే భయమేస్తోందని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.

ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, కబ్జాలు,

దందాలతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు

గతంలో ఓ ల్యాండ్‌ వివాదంలో

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత

మాండ్రకు బిగుస్తున్న ఉచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement