
● వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని, రామయ్య ● ఘనంగా వైఎస్సార్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం
కర్నూలు(రాజ్‌విహార్) శ్రామికుల పక్షాన నిలిచి వారి సంక్షేమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య అన్నారు. మంగళవారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్‌బీఐ సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నంద్యాల చెక్‌పోస్టు వద్ద భారీ కేక్ కట్ చేసి ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలోని ఎస్ అనే పదానికి శ్రామిక అని అర్థం వస్తుందని పార్టీ ఆవిర్భావ సమయంలోనే శ్రమ జీవులకు అండగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ విధంగా పేరు పెట్టారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు ఏ సమస్య వచ్చినా అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, వైఎస్సార్ టీయూసీ కర్నూలు, నంద్యాల జోనల్ ఇన్‌చార్జ్ కిషన్, జిల్లా అధ్యక్షుడు భీమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.