
● వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో ఎమ్మెల్యే శిల్పా రవి
నంద్యాల: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్‌హాల్‌లో నంద్యాల నియోజకవర్గ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితరులు మహిళలకు అందజేశారు. అనంతరం లబ్ధిపొందిన మహిళలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ నాడు టీడీపీ ప్రభుత్వం హయాంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాజీ సీఎం చంద్రబాబునాయుడు మహిళలను మోసం చేశారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలకు అండగా నిలిచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా కింద అక్కచెల్లెమ్మల ఖాతాలో ఇప్పటి వరకు మూడు విడతల్లో 19 వేల కోట్ల రూపాయలు జమ చేశారన్నారు. నంద్యాల నియోజకవర్గంలో మూడో విడత రూరల్ పరిధిలో 2,001 స్వయం సహాయక గ్రూపులకు రూ.13.95 కోట్లు, మున్సిపాలిటీలో 2,419 స్వయం సహాయక గ్రూపులకు రూ.15.29 కోట్లు మొత్తం 29.24 కోట్లు మహిళల ఖాతాలో జమ అయ్యాయన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పరన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని రంగాల్లో 50 శాతం పైగానే మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం విశేషమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్, సునీత అమృతరాజ్, శశికళారెడ్డి, జెడ్పీటీసీ గోకుల్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ మహేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు.
రైతునగరంలో సచివాలయం ప్రారంభం..
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు రైతునగరంలో రూ.35 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీనాగిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్సార్‌సీపీ నాయకులు రామసుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న పొదుపు గ్రూపు మహిళలు