
కర్నూలు నగరంలోని ఓ హలీమ్ విక్రయ కేంద్రం
‘అస్సాలామ్ అలైకుమ్ భాయ్.. ఇఫ్తార్‌కా వక్త్ హోరహా హై. మస్‌జిద్ చలో. అచ్ఛ దోస్త్ ఇఫ్తార్‌కే బాద్ అచ్ఛీ హోటల్‌పే జాకె హలీమ్ ఖయేంగే.. అచ్ఛ భాయ్. జరూర్ సే బహుత్ మజేదార్ హలీమ్ ఖాయేంగే’. ఇదీ రంజాన్ మాసంలో సాయంత్రం కలిసిన మిత్రుల సంభాషణ.
హలీమ్ ..
● చక్కటి పౌష్టికాహార వంటకంగా పేరు ● ఒక్కనెలలోనే రూ.2 కోట్ల వ్యాపారం ● నగరంలోనే 30కు పైగా విక్రయ కేంద్రాలు
కర్నూలు(రాజ్‌విహార్): కేవలం రంజాన్ మాసంలోనే లభించే హలీమ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. మటన్, నెయ్యితో చేసిన ఈ వంటకంలో వేయించిన ఉల్లి, కొత్తమీర, కాస్త పుదినా, జీడిపప్పు, నిమ్మకాయ వేసుకొని వేడివేడిగా తింటూ కాస్త పచ్చి ఉల్లి నంచుకుంటే ఆ రుచే వేరు. బలం, రుచికరమైన ఈ వంటను చూస్తే చాలు నోటిలో లాలాజలం ఊరుతుంది. ఒక్కసారి రుచి చూసిన ప్రతి ఒక్కరూ మరోసారి తినాలనుకుంటారు. ఉపవాస దీక్షలు లేనివారు సైతం లొట్టలేసుకొని ఆరగిస్తారు. కేవలం ముస్లింలే కాదు.. మాంసాహార ప్రియులు కూడా ఆ వంట వాసనకు ఆకర్షితులై ఒక్కసారైనా రుచి చూడాలని అనుకుంటారు. ఇదీ హలీమ్ ప్రత్యేకత.
నగర వీధుల్లో హలీమ్ ఘుమఘుమలు..
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. కర్నూలు నగర ప్రధాన వీధుల్లో హలీమ్ వాసన ఘుమఘుమలాడుతుంది. ఆ వాసనకే దీని రుచి చూడాలని కొందరు.. కొత్తగా ట్రై చేసే వారు మరికొందరు.. ప్రతి ఏటా దీని రుచిని ఆస్వాదించే వారు ఇంకొందరు. రంజాన్ మెనూలో హలీమ్ తొలి స్థానాన్ని కై వసం చేసుకుంది. దమ్ బిర్యానీకి ఎంత పేరుందో రంజాన్ సీజన్‌లో దానికి మించి హలీమ్‌కు ప్రత్యేకత ఉంది. పొట్టేలు మాసం, నెయ్యి, గోధుమ రవ్వ, పిండిని వాడి దీనిని తయారు చేయడంతో ఇది మంచి పోషకాహారంగా చెప్పవచ్చు. ఈ కారణంగా అంతా దీనికి అభిమానులే. కర్నూలుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం నగరంలో చికెన్ హరీస్ క్వాలిటీని బట్టి రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. అదే మటన్ హలీమ్ అయితే రూ.150 నుంచి రూ.200 వరకు అందుబాటులో ఉంది. నగరంలో వివిధ చోట్ల 30కు పైగా వికయ కేంద్రాలు ఉన్నాయి. రంజాన్ మాసంలో నగరంలో సుమారు రూ.2కోట్ల వరకు వ్యాపారం జరుగుందని వ్యాపారస్తుల అంచనా.
రంజాన్ ప్రత్యేకం


హలీంను ఆరగిస్తున్న యువకులు