
నంద్యాలలో పరీక్ష కేంద్రం వద్ద హాల్ టికెట్ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థినులు
నంద్యాల(సిటీ)/ప్యాపిలి: ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కర్నూలులో 70 కేంద్రాలు, నంద్యాలలో 53 పరీక్ష కేంద్రాల్లో 32,628 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 31,618 మంది హాజరైనట్లు ఆర్‌ఐఓ గురువయ్యశెట్టి తెలిపారు. కాగా 1,010 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు ఉదయం 8 గంటలకే విద్యార్థులు చేరుకోగా 8.15 గంటల నుంచే లోపలికి అనుమతించారు. 9 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించ లేదు. ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి పెద్దపొదిళ్ల గ్రామానికి చెందిన మనోజ్ రామకృష్ణ, వినోద్ మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. నిబంధనల మేరకు ప్రిన్సిపాల్ బాలసుబ్రమణ్యం వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో తెలుగు పరీక్ష రాయలేకపోయారు.