నల్లగొండ టౌన్ : బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొదటి దశలో వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 14 నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న 21 వేల మంది బాలికలను గుర్తించామని తెలిపారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టీకా వేస్తామన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. అర్హులైన బాలికల వివరాలను ఆధార్ కార్డు ఆధారంగా నమోదు చేస్తామని తెలిపారు. టీకా తీసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, బాలికలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, నగేష్, మహేష్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు నాగలక్ష్మి, వేణుగోపాల్‌రెడ్డి, సుభాష్, వైద్యులు పుల్లారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రకృతివనాన్ని
పరిశుభ్రంగా ఉంచుకోవాలి
రామగిరి(నల్లగొండ) : పల్లె ప్రకృతి వనాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండ మండలం చందనపల్లి పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆదివారం ఆయన పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మంచి పూల మొక్కలు, నీడనిచ్చే, ఉపయోగకరమైన మొక్కలను పెంచాలని సూచించారు. ప్రజలు, పిల్లలు విశ్రాంతి తీసుకునేలా తీర్చిదిద్దాలన్నారు. డంపింగ్ యార్డ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి పనిచేయాలన్నారు.


