పంచాయతీ ఎన్నికల పటిష్ట భద్రత
నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పరిధిలో మూడు దశల్లో 869 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికలకు తన పర్యవేక్షణలో ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 84 మంది ఎస్‌ఐలతో కలిపి 1,680 మందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 442 గ్రామ పంచాయతీలను సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రతీ పోలింగ్‌స్టేషన్ పరిధిలో అదనపు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీ అదనంగా పర్యవేక్షిస్తుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తులు, రౌడీషీటర్స్ కదలికలను కట్టడి చేసేందుకు అన్ని కోణాల్లో దృష్టి సారించినట్లు తెలిపారు. నేర చరిత్ర కలిగిన, గత ఎన్నికల్లో కేసులు, గొడవల్లో ఉన్న పాత నేరస్తులు, రౌడీ షీటర్లను 1141 మందిని బైండోవర్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 163 (బీఎన్‌ఎస్‌ఎస్) యాక్ట్ అమలులో ఉంటుందని నలుగురు కంటే ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎవరైనా నగదు, మద్యం ఇతరత్రా వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం అందించాలని కోరారు.
ఎన్జీ కళాశాలలో
జాబ్‌మేళా
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీలో టీఎస్‌కేసీ, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. న్యూ ల్యాండ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, హానర్ ల్యాబ్ లిమిటెడ్ కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ అర్హత కలిగిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్.ఉపేందర్, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ ఎం.అనిల్‌కుమార్, కెమిస్ట్రీ ఇన్‌చార్జి ఏ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు సెలవు ఇవ్వాలి
నల్లగొండ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 10, 11, 13, 14, 16, 17 తేదీల్లో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు లేదా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగిన సమయం ఇవ్వాలని ఆయా యాజమాన్యాలను లేబర్ కార్యాలయం డిప్యూటీ కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ సూచనలు, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988 ప్రకారం, ఉద్యోగులను ఓటు వేయకుండా అడ్డుకుని పని చేయించటం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను పాటించని యజమాన్యాలకు జరిమానా విధించడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల రోజున జిల్లా వ్యాప్తంగా లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.
సహకార సంఘంపై కేసు
నిడమనూరు : నిడమనూరు సహకార సంఘంపై కేసు నమోదైంది. నిడమనూరు మార్కెట్‌లోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంగళవారం తూనికల కొలతల శాఖా ఆధ్వర్యంలోని తనిఖీలు నిర్వహించారు. అధికారుల వద్ద ఉన్న తూకం రాళ్లతో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను సరిచూశారు. తూకాలు అధికంగా ఉండటం గుర్తించి.. సహకార సంఘంపై కేసు నమోదు చేసినట్లు తూనికలు కొలతల శాఖ అధికారులు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల పటిష్ట భద్రత


