ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ : మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బుధవారం ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను తెరిచి ఉంచాలని, దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్‌ను ముందుగా పంపించాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది ఉదయం 7.30 గంటలకు విధుల్లో రిపోర్ట్ చేయాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు టీ పోల్‌లో ఉంచాలన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి నీళ్ల బాటిళ్లు తీసుకువెళ్లకుండా చూడాలన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు అంతా సిద్ధం చేశాం
నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ, చండూరు డివిజన్లలోని 14 మండలాలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్నీ సిద్ధం చేశామని.. కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నల్లగొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించామని, పోలింగ్ సిబ్బంది, పార్కింగ్, సిబ్బందికి భోజనం, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సూక్ష్మ పరిశీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహించే పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీపీఓ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


