గడువు దాటితే వడ్డింపే
ఆస్తి పన్నును ఈనెలాఖరులోగా చెల్లించి అదనపు రుసం పడకుండా చూసుకోవాలి. డిసెంబర్ 31వ తేదీలోగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసుం ఉండదు. పట్టణ ప్రజలు దీనిని గమనించి గడువులోగా ఆస్తి పన్ను చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలి.
– శివరాంరెడ్డి, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్, నల్లగొండ
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆ తరువాత వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్‌గా కంప్యూటర్‌లో అపరాధ రుసుంతో జనరేట్ అవుతుంది. గతంలో ఆన్‌లైన్ వ్యవస్థ లేని సమయంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది పన్ను బకాయిపై అపరాధ రుసుం వేయకపోవడంతో ఇప్పుడు కూడా భవన యాజమానులు అదే విధానం ఉందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ వ్యవస్థ వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా తేడా రావడానికి వీలు లేదనే విషయాన్ని చాలా గమనంలోకి తీసుకోవాలి. ఈనెల 31లోగా చెల్లించని వారికి ఆస్తి పన్నుపై వంద రూపాయలకు రెండు రూపాయల చొప్పున వడ్డీ పడనుంది.
పన్ను తగ్గింపునకు ఆస్కారం ఉండదు..
ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లిస్తున్నాం కదా.. ఎప్పుడో ఒక రోజు కడుదామనుకుంటే పప్పులో కాలేసినట్లే. మొదటి అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను జూన్‌లోగా, రెండో అర్ధ సంవత్సరం పన్ను డిసెంబర్ 31లోగా చెల్లించాలి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆరు నెలల పన్నుపై వడ్డీ పడుతుంది. అపరాధ రుసుంకు సంబంధించి తగ్గింపు లాంటివి ఇక్కడి స్థానిక మున్సిపల్ అధికారుల పరిధిలో ఉండదు. భవన యజమానులంతా అపరాధ రుసుం పడకుండా ఉండాలంటే ఈనెల 31వ తేదీలోగా ఆస్తి పన్ను చెల్లించాలి.
నీలగిరి పట్టణంలో 43 వేల భవనాలు..
నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో వాణిజ్య, నివాస భవనాలు కలిపి 43 వేలకు పైగానే ఉన్నాయి. సంవత్సరానికి ఆస్తి పన్ను డిమాండ్ రూ.18 కోట్లకు పైగానే ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముందస్తు పన్ను రాయితీలో భాగంగా గత ఏప్రిల్‌లో ఒక్క నెలలోనే రూ.7.60 కోట్లు వసూలు చేశారు. మిగతా వారు ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ సిబ్బంది గతంలోనే ఇంటింటికీ తిరిగి డిమాండ్ నోటీసులు పంపిణీ చేశారు. ఆర్వో పర్యవేక్షణలో 36 మంది వార్డు ఆఫీసర్లు, ఇద్దరు ఆర్‌ఐలు కలిపి నాలుగు బృందాలుగా ఏర్పడి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. పాత బకాయిలు, ప్రస్తుత పన్ను కలిపి మొత్తంగా రూ.33 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇటీవల బకాయిలు ఎక్కువగా ఉన్న 800 మందికి రెడ్ నోటీసులు కూడా జారీ చేశారు.
ఫ నెలాఖరుతో ముగియనున్న ఆస్తిపన్ను చెల్లింపు గడువు
ఫ ఆ తర్వాత అపరాధ రుసుంతో కలిసి వసూలు


