వాగు పారి.. వంతెన తెగి..
చందంపేట : మోంథా తుపాను కారణంగా ఇటీవల కురిసిన వర్షాలతో నేరెడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరబాయితండా, గాజుబెడం తండాల మధ్య వంతెన తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఇరవై రోజుల క్రితం భారీగా కురిసిన వర్షాల వల్ల ఈ రెండు తండాల మధ్య ఉన్న వాగు పోటెత్తింది. వరద ధాటికి ఆయా తండాల మధ్య ఉన్న లోలెవల్ వంతన పూర్తిగా తెగిపోయింది. ఫలితంగా ఆయా తండాల్లో 60 కుటుంబాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి గడుపుతున్నాయి. కనీసం సెల్ సిగ్నల్ కూడా రాకపోవడంతో సమాచారం తెలుపడం కూడా కష్టతరంగా మారింది. తెగిన వంతెన మీదుగా పారుతున్న వదర తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే గిరిజనులు అతికష్టమీద కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వంతెన వద్ద రోడ్డంతా ధ్వంసం కావడంతో వాహనాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తెగిన వంతెన దాటి వాగు అలుగు మీదుగా గాజుబెడం తండాకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కూడా వాగు పారుతుండడంతో గాజుబెడంతండా వాసులకు ఇటు వాగుదాటి రావడం ప్రాణసంకటంగా మారింది. ఒకవేళ వాగు దాటి వచ్చినా మళ్లీ తెగిపోయిన వంతెన వద్ద వరదలోంచి రాకపోకలు సాగించాలి. ప్రస్తుతం వాగు పారుతుండడం.. వంతెన తెగి రోడ్డు ధ్వంసౖం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.
నిత్యావసర సరులకు లేక అష్టకష్టాలు
వరద ధాటికి వంతెన తెగిపోవడంతో ఊరబాయితండా, గాజుబెడంతండాలోని గిరిజనులు నిత్యావసర సరుకులు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఆయా తండాలకు చెందిన విద్యార్థులు కూడా స్కూళ్లకు వెళ్లేలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే రెండు నెలల నుంచి కృష్ణానీటి సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నామని ఆయా తండాల వాసులు వాపోతున్నారు.
పట్టించుకోని అధికారులు
70 ఏళ్లుగా తండాల్లో ఉంటున్న తమకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని..ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని ఆయా తండాల వాసులు అంటున్నారు. తాజాగా కాచరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరబాయితండా, గాజుబెడంతండాలకు రాకపోకలు నిలిచిపోయి 15 రోజులు కావస్తున్నా ఏ ఒక్క అధికారి తమ తండాల వైపు కన్నెత్తిచూసిన పాపన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికార యంత్రాంగం స్పందించి రెండు తండాల మధ్య ధ్వంసమైన వంతెనకు మరమ్మతులు చేపట్టి శాశ్వత రోడ్డు ఏర్పాటు చేయడంతోపాటు తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆయా తండాల వాసులు కోరుతున్నారు.
ఫ ఊరబాయితండా, గాజుబిడంతండాల మధ్య స్తంభించిన రాకపోకలు
ఫ 15 రోజులుగా దిగ్బంధంలో
60 కుటుంబాలు
ఫ ఇప్పటికీ పారుతున్న
గాజుబిడంతండా వాగు
ఫ స్కూళ్లకు కూడా పోలేని చిన్నారులు
ఫ నిత్యావసర సరుకులకు
అలమటిస్తున్న గిరిజనులు
వాగు పారి.. వంతెన తెగి..


