శిశు విక్రయాలు జరగకుండా చూడాలి
నల్లగొండ : జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు జి.చందన, జి.సరిత అన్నారు. గురువారం ఉదయాదిత్య భవన్లో మహిళా, శిశు, సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలలు, అంగన్‌వాడీ, శిశు సంరక్షణ కేంద్రాలు సందర్శించి పిల్లల సంక్షేమం, భద్రత, విద్యా సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు. చదువుకుంటే జీవితం బాగుంటుందని పిల్లలు, వారి తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి రూపాయ చివరి పిల్లవాడి వరకు అందేలా చూడాలని కోరారు. జిల్లా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, హౌసింగ్ పీడీ, బీసీ సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, డీఈఓ భిక్షపతి, డీటీడీఓ చత్రునాయక్, ట్రైబల్ ఆర్సీఓ బలరాం, డీసీపీఓ గణేష్, ఎంఈఓ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
బాలల విద్యపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, వారి విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు జి.చందన, జి.సరిత జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కేజీబీవీల ద్వారా అందిస్తున్న విద్య, పౌష్టికాహార పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిశారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాలల విద్య, పరిరక్షణ కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. నియమ, నిబంధనల ప్రకారం పిల్లల దత్తత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారివెంట జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఫ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చందన, సరిత


