టెండరు దాటని చేప పిల్లలు | - | Sakshi
Sakshi News home page

టెండరు దాటని చేప పిల్లలు

Oct 13 2025 8:30 AM | Updated on Oct 13 2025 8:30 AM

టెండరు దాటని చేప పిల్లలు

టెండరు దాటని చేప పిల్లలు

అదును దాటుతోంది

నల్లగొండ టూటౌన్‌ : మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్నది. ఈ ఏడాది చేప పిల్లల సరఫరా కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచి నెలరోజులు అవుతున్నా నేటికీ అవి తెరచుకోలేదు. దాంతో ఉచిత చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు.

ఆలస్యంగా టెండర్లు

ఈ ఏడాది మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. చేపపిల్లలను సరఫరా చేసేందుకు ఉన్నతాధికారులు గత నెలలో రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలిచారు. గుత్తేదారులు టెండర్లలో పాల్గొనక పోవడంతో రెండోసారి ప్రతి జిల్లా నుంచి టెండర్లను పిలిచారు. నల్లగొండ జిల్లా నుంచి కూడా చాలా మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. కానీ ఆయా టెండర్లను నేటికీ తెరువక పోవడంతో చెరువుల్లో పోసేందుకు ఉచిత చేపపిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూడాల్సి వస్తోంది. రెండు నెలల పాటు భారీ వర్షాలు కురియడంతో గత నెల మొదటి వారంలోనే జిల్లాలోని 80శాతం చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాయి. మిగతా వాటిలో కూడా చేప పిలలు పోసుకునేందుకు పుష్కలంగా నీరు చేరింది. కానీ మత్స్యశాఖ అధికారులు చేప పిల్లల పంపిణీ ఎప్పుడు చేస్తారనే విషయమై నేటికీ స్పష్టత లేకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

60 వేల మందికి ఉపాధి

జిల్లాలో 1,150 చెరువులు, కుంటలు, జలాశయాలు ఉన్నాయి. వీటిలో పోసేందుకు 6 కోట్ల చేపపిల్లలు అవసరమవుతాయని మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 260 మత్స్య సొసైటీలు ఉండగా, వాటిలో 28 వేల మంది సభ్యులు ఉన్నారు. చెరువులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సుమారు 60 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పటికే చెరువులు, కుంటలు, భారీ జలాశయాలు నిండు కుండలా ఉన్నా వాటిలో వేసేందుకు ఉచిత చేపపిల్లల సరఫరాపై సిందిగ్ధం వీడడం లేదు.

ఫ తెరుచుకోని మత్స్యశాఖ టెండర్లు

ఫ జిల్లాలో నిండిన చెరువులు, కుంటలు

ఫ ఉచిత చేప పిల్లల కోసం మత్స్యకారుల ఎదురు చూపులు

ఫ జిల్లాలో 260 మత్స్య సొసైటీలు

చేప పిల్లల సరఫరాకు దాఖలైన టెండర్లు నేటికీ తెరచుకోక పోవడంతో మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం నెలకొంది. అదును దాటిపోయిన తరువాత జలాశయాల్లో చేప పిల్లలు పోస్తే వేసవిలో చెరువుల్లో నీరు తగ్గిపోయి చేప పిల్లలు బరువు పెరగదు. కనీసం ఆరు నుంచి 8 నెలలు అయితేనే చేప పిల్లలు కిలో వరకు బరువు పెరుగుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లలు నవంబర్‌ నాటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లు చేప పిల్లలు పంపిణీ చేసేందుకు మరో నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై మత్స్యశాఖ అధికారిని వివరణ కోరేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement