
నేడు ప్రజావాణి యథాతథం
నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల కోడ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసిందని, దాంతో ఈ నెల 13న కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు దారులు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.
పేదల జోలికొస్తే ఊరుకోం
మిర్యాలగూడ : ప్రభుత్వం పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆయన పర్యటించారు. తాళ్లగడ్డలోని మల్లెతోట వద్ద ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకొని నిరుపేదలకు అమ్మారని, అది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు పేదలను ఖాళీ చేయించాలని చూడడం సరికాదన్నారు. అష్టకష్టాలు పడి కూడబెట్టుకున్న డబ్బులతో భూమిని కొనుగోలు చేసుకొని ఇండ్లు నిర్మించుకుంటే ఇప్పుడు స్వాధీనం చేసుకుంటామనడం దారుణమన్నారు. పేదల పక్షాన నిలబడి వారికి పట్టాలు వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీలో 20 సంవత్సరాల క్రితం ఇండ్లు నిర్మించుకున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం లేదన్నారు. కాలనీలో డ్రైనేజీ, వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాలనీ ప్రజలకు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, కోడిరెక్క మల్లయ్య, అరుణ, కరీం, జహంగీర్, రామారావు, వెంకటేశ్వర్లు, కోల వెంకటేశ్వర్లు, వీరేందర్, పున్నమ్మ, సైదమ్మ, నాగమణి, రాంబాబు ఉన్నారు.
నేడు జాతీయ రహదారి దిగ్బంధం
మునుగోడు: స్థానిక సంస్థలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కొంత మంది కోర్టు ద్వారా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు మేరకు సోమవారం జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టనున్నట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనగంటి కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించినా అగ్రకులాల నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి దిగ్భంధానికి బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
మత్స్యగిరి ఆలయంలో 16న హుండీల లెక్కింపు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీలను ఈనెల 16న లెక్కించనున్నారు. ఈమేరకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నరేష్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.