స్వయం సహాయక మహిళా సంఘాలకు డీసీసీబీ రుణాలు | - | Sakshi
Sakshi News home page

స్వయం సహాయక మహిళా సంఘాలకు డీసీసీబీ రుణాలు

Sep 13 2025 7:21 AM | Updated on Sep 13 2025 7:35 AM

స్వయం

స్వయం సహాయక మహిళా సంఘాలకు డీసీసీబీ రుణాలు

సభ్యురాలు మరణిస్తే రుణం రద్దు

మహిళలకు అవగాహన కల్పిస్తాం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని మహిళ స్వయం సహాయక సంఘాలకు చేయూతను అందించేందుకు నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ముందుకొచ్చింది. ఇప్పటివరకు మహిళ సంఘాలు తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు 11.5 శాతం నుంచి 12 శాతం వరకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీని వసూలు చేస్తున్నాయి. అయితే మొదటిసారిగా డీసీసీబీ ఆయా సంఘాలకు 7 శాతం 10 శాతంలోపు వడ్డీకి రుణాలు అందించేందుకు ముందుకు వచ్చింది. నాబార్డు సహకారంతో ఈ రుణాలను అందించేందుకు డీసీసీబీ చర్యలు చేపట్టింది. ఇటీవల నల్లగొండలోని బ్యాంకులో చైర్మన్‌ కుంభం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నాబార్డు, డీఆర్‌డీఏ అధికారులతో జరిగిన సమావేశంలో మహిళ సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలను ఇవ్వాలని నిర్ణయించారు.

సంఘాల లావాదేవీలు రూ.2 వేల కోట్లు

ప్రస్తుతం నల్లగొండలో 36,695 మహిళ సంఘాల్లో 3,66,955 మంది, సూర్యాపేట దాదాపు 20 వేల సంఘాల్లో 2 లక్షల వరకు, యాదాద్రిలో 15 వేలకు పైగా ఉన్న సంఘాల్లో 1.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం వారికి వడ్డీలేని రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహిళ సంఘాలు దాదాపు రూ.2 వేల కోట్ల రుణాలను తీసుకున్నాయి. వారు తీసుకున్న రుణాలను నెలవారీగా వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించాలి. అలా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. ఇలా ఆయా సంఘాల మహిళలు వడ్డీలేని రుణాలు పొందుతున్నారు. అయితే అంతిమంగా ఆ వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తోంది.

అటు సంఘాలు, ఇటు ప్రభుత్వంపై భారం

ప్రస్తుతం వాణిజ్య బ్యాంకులు ఇస్తున్న రుణాలపై 11.5 శాతం నుంచి 12 శాతం వరకు (ఎంత మొత్తం తీసుకున్నా వడ్డీ ఒకే రేటు) వడ్డీ వసూలు చేస్తున్నాయి. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేప్పుడు మహిళ సంఘలు వడ్డీని కూడా చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో వడ్డీ భారం వారిపై పడుతోంది. ఆ తరువాత ప్రభుత్వం ఇస్తున్నందున ప్రభుత్వంపైనా పడుతోంది. కాగా.. డీసీసీబీ ఇచ్చే రుణ పరిమితిని బట్టి స్లాబుల రూపంలో (7 శాతం, 8 శాతం, 9.90 శాతం) వడ్డీ రేటును నిర్ణయించింది. దీంతో ఇటు సంఘాలపై, అటు ప్రభుత్వంపై కూడా వడ్డీ భారం తగ్గనుంది.

మొదట 1,255 సంఘాలకు..

ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 1255 సంఘాలకు దాదాపు రూ.200 కోట్ల రుణాలను ఇవ్వాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో 480, సూర్యాపేట జిల్లాలో 375, యాదాద్రి భువనగిరి జిల్లాలో 400 సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఆ తరువాత దశల వారీగా మిగతా మహిళ సంఘాలను కూడా డీసీసీబీ పరిధిలోకి తీసుకువచ్చేలా కసరత్తు చేస్తోంది.

నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద మహిళ సంఘాలకు డీసీసీబీ రుణాలను ఇవ్వనుంది. ఇందులో 7 శాతం వడ్డీతో రూ.3 లక్షలలోపు, 8 శాతం వడ్డీతో రూ.3 లక్షలనుంచి రూ.5 లక్షల లోపు, 9.90 శాతం వడ్డీతో రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలను ఇవ్వనుంది. ఇతర బ్యాంకులతో పోల్చితే 2 శాతం నుంచి 4 శాతానికి పైగా వడ్డీ భారం తగ్గనుంది. మరోవైపు గ్రూపుల్లోని మహిళ ఎవరైనా అనుకోకుండా మరణిస్తే ఆమె తీసుకున్న రుణం కూడా రద్దు అవుతుంది.

ఫ వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే..

ఫ 2 శాతం నుంచి 4 శాతానికిపైగా తగ్గనున్న వడ్డీ భారం

ఫ మొదట ఉమ్మడి జిల్లాలోని 1,255 సంఘాలకు రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు

ఫ తరువాత అన్ని సంఘాలను డీసీసీబీ పరిధిలోకి తెచ్చేలా కసరత్తు

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళ సంఘాలకు తాము తక్కువ వడ్డీకే ఇచ్చే రుణాలపై అవగాహన కార్యక్రమాలను చేపడతాం. క్షేత్రస్థాయిలో డీఆర్‌డీఏ సిబ్బంది సహకారంతో వారు తమకు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేలా చర్యలు చేపడతాం. మా బ్యాంకు బ్రాంచీల అధికారులు, ఏపీఎంలతో డీఆర్‌డీఏ ఉన్నతాధికారులు సమావేశమై క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణను త్వరలోనే ఖరారు చేస్తారు. అలాగే గ్రామాల్లో వాల్‌ పోస్టర్ల ద్వారా ఆయా సంఘాల్లో అవగాహన కల్పించి డీసీసీబీలో రుణాలు తీసుకునేలా చర్యలు చేపడతాం.

– కుంభం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌

స్వయం సహాయక మహిళా సంఘాలకు డీసీసీబీ రుణాలు 1
1/2

స్వయం సహాయక మహిళా సంఘాలకు డీసీసీబీ రుణాలు

స్వయం సహాయక మహిళా సంఘాలకు డీసీసీబీ రుణాలు 2
2/2

స్వయం సహాయక మహిళా సంఘాలకు డీసీసీబీ రుణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement