
గ్రామాల రూపురేఖలు మారుస్తాం
కొండమల్లేపల్లి (చింతపల్లి) : గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. గ్రామాలను అభివృద్ధి చేసి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శంకుస్థాపన చేశారు. చింతపల్లి మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో సైడ్ డ్రైన్లు, అంతర్గత సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో అన్ని వసతులతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత మండలంలోని హరిజనా పురం గ్రామంలో నూతన ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, మార్కెట్ చైర్మన్ దొంతం అలివేలు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్
నిర్మాణానికి స్థల పరిశీలన
కొండమల్లేపల్లి : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొల్‌ముంతలపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 202లో 25 ఎకరాల భూమిని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌తో శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో పాఠశాలను రూ.200 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఆర్‌ఐ శ్రీనివాస్, దొంతినేని వెంకటేశ్వర్‌రావు తదితరులున్నారు.