జీపీఓలు ఎప్పుడొస్తరో!
జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాలు..
జిల్లాలో మొత్తం 566 రెవిన్యూ గ్రామాలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. కానీ 184 మంది మాత్రమే పరీక్షలో అర్హత సాధించారు. అంటే ప్రభుత్వం అన్ని గ్రామాలకు జీపీఓలను నియమించాలంటే గతంలో జూనియర్ అసిస్టెంట్లుగా ఇతర శాఖల్లోకి వెళ్లిన వారిని తిరిగి నేరుగా తీసుకుని భర్తీ చేస్తుందా.. లేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందా అనే విషయంలో కూడా స్పష్టత లేదు. లేదా కొన్ని రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి.. ఆ క్లస్టర్‌కు ఒక జీపీఓను నియమిస్తుందా అన్న చర్చ సాగుతోంది.
నల్లగొండ : రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గ్రామ పాలన అధికారులను (జీపీఓ) నియమించాలని నిర్ణయించింది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడంతో వీఆర్‌ఓలుగా పని చేసిన వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదలాయించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి.. భూ భారతిని తీసుకొచ్చింది. అందులో భాగంగానే రెవెన్యూ వ్యవస్థకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన వీఆర్‌ఓలు తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చే వారి నుంచి దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే. అయితే వారికి పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించినా.. నియామకాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
పరీక్షలో 184 మంది అర్హత
రెవిన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన వారు తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చేందుకు 241 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిని ఆ శాఖలోకి నేరుగా తీసుకోకుండా మే 27న పరీక్ష నిర్వహించింది. అందులో 241 మందికి గాను 184 మంది మాత్రమే అర్హత సాధించారు.
కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం భూ భారతిని ప్రారంభించింది. 3వ తేదీ నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే అదే రోజున గ్రామ పాలన అధికారులను కూడా నియమిస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో.. పరీక్షలో అర్హత సాధించిన వారంతా ఎదురుచూపుల్లోనే ఉన్నారు.
ఫ గ్రామ పాలనాధికారుల నియామకంపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ఫ ఎదురుచూపుల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు


