తొలిరోజు 3,263 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం –2025ను అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంగళవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లాలోని 55 గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో వివిధ సమస్యలపై 3,263 దరఖాస్తులను రైతులు సమర్పించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి తిప్పర్తి, కేతేపల్లి మండలాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అమిత్‌నారాయణ్, ఆర్డీఓలు పలు సదస్సులకు హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ప్రతి మండలంలో రెండు బృందాలు
పత్రి మండలంలో రెండు బృందాలు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాయి. ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు ఆయా గ్రామాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసిన దరఖాస్తు ఫారాలను రైతులకు ఇస్తూ.. సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ధరణి కష్టాలు తీరుతాయని ఆశ..
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో ఏర్పడిన ఇబ్బందులు తీర్చాలని ఇప్పటి వరకు రైతులు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగారు. కానీ అవి పరిష్కారం కాక నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో ఉన్నారు. దీంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
ఫ భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభం
ఫ 55 గ్రామాల్లో నిర్వహణ
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
తిప్పర్తి : రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకొని భూసమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం తిప్పర్తి మండలంలోని దుప్పలపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును ఆమె సందర్శించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పరుశురాం, డీటీ ఆబేదాబేగం తదితరులు ఉన్నారు.


