ఉద్యోగం.. ఉజ్వల భవిష్యత్తుకు పునాది
రామగిరి(నల్లగొండ) : ఉద్యోగం.. ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యువతేజం మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీస్‌శాఖ.. శాంతి భద్రతల నిర్వహణతోపాటు, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలో పోలీస్ శాఖ తరఫున జాబ్‌మేళా నిర్వహించడం ఇదే మొదటిసారని చెప్పారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దడంతోపాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న పోలీస్‌శాఖను అభినందించారు. అనంతరం మెగా జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మెగా జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన వారు మొదటిసారి వేతనం తక్కువగా ఉన్నప్పటికీ నిరాశపడవద్దని, అనుభవం కోసం కృషి చేయాలన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవర్ మాట్లాడుతూ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు 112 కంపెనీలు వచ్చాయని, 6497 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. 3300 మందిని ఆయా కంపెనీలు ఎంపిక చేసుకున్నాయని.. మరో 40 మందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎల్‌ఐసీ ఎంపిక చేసిందని వివరించారు. ఈ జాబ్‌మేళాలో అత్యధికంగా రూ.45 వేల వేతనం పొందే ఉత్తర్వులు ఇచ్చామన్నారు. యువత సంఘవిద్రోహ శక్తులుగా తయారు కాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో జాబ్‌మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఉద్యోగానికి ఎంపిక కాని వారు నిరాశపడొద్దని సూచించారు. జాబ్‌మేళాకు హాజరైన వారికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయం కల్పించడంపై ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, డీఎస్పీ శివరాంరెడ్డి, జాబ్ కో ఆర్డినేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్‌మేళా
ఫ హాజరైన 112 కంపెనీల ప్రతినిధులు
ఫ 6,497 మంది నిరుద్యోగుల రిజిస్ట్రేషన్


