జీవాల పెంపకానికి చేయూత
నల్లగొండ అగ్రికల్చర్: దేశంలో మాంసం విని యోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు సరిపడా మాంసం ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో మాంసానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జీవాల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే గొర్రెలు, మేకల పెంపకానికి నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ స్కీం (ఎన్‌ఎల్‌ఎంఎస్) కింద ఉత్సాహావంతులైన వ్యాపారులు, పెంపకందారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని భావిస్తోంది. అయితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని రాష్ట్ర పశువైద్య సంవర్థక శాఖ అమలు చేస్తోంది. జీవాలకు సంబంఽఽధించిన సబ్సిడీ పూర్తిగా విడుదలయ్యే వరకు ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖ పర్యవేక్షించనుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో యాభై శాతం లేదా రూ.50 లక్షలు మించకుండా పెంపకందారులకు సబ్సిడీ రుణాలు అందించనున్నారు. యూనిట్ ప్రారంభం మొదలుకుని రెండు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ నిధులు జమ చేయనున్నారు.
ఇలా.. దరఖాస్తు చేయాలి
గొర్రెలు, మేకల యూనిట్‌ల కోసం www.nim.udyamimitra.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులకు రాష్ట్ర పశువైద్య సంవర్థక శాఖ ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుని పాన్‌కార్డు, ఆధార్, అడ్రస్ ప్రూఫ్, పాస్ పోర్టు ఫొటో, రుణం తీసుకునే బ్యాంకు స్టేట్‌మెంట్, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అర్హతలు ఇవే..
గొర్రెలు, మేకలు పెంపకంపై ఆసక్తి కలిగిన వ్యక్తి లేదా సంస్థ లేదా స్వయం సహాయక సంఘాలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పశుపోషణలో తగిన అనుభవం కలిగి ఉండాలి. గొర్రెలు మేకల పెంపకంపై ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పొంది ఉండాలి. సాంకేతిక సలహాదారుడిగా అనుభవజ్ఞులైన పశువైద్య సిబ్బందిని ఫాం నిర్వహణకు నియమించుకోవాల్సి ఉంటుంది.
మాంసం ఉత్పత్తి పెంచేలా కేంద్రం చర్యలు
ఫ ఎన్‌ఎల్‌ఎం స్కీం ద్వారా రుణాలు
ఫ యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ
ఫ గరిష్టంగా రూ.50 లక్షలు మంజూరు
ఫ ఆన్‌లైన్‌లో అర్జీలకు ఆహ్వానం
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకాన్ని గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగ యువత యూనిట్లు పొంది స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి. దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. ఇతర వివరాల కోసం నల్లగొండలోని జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి.
– జీవీ.రమేష్, జిల్లా పశువైద్య సంవర్థక
శాఖ అధికారి, నల్లగొండ
యూనిట్లకు సబ్సిడీ ఇలా..
యూనిట్ సబ్సిడీ
(గొర్రెలు, పొట్టేళ్లు) (రూ.లక్షల్లో..)
500–25 50
400–40 40
300–15 30
200–10 20
100–05 10


