
నల్లగొండ టౌన్ : నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన పప్పుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కంది, పెసర, మినుము, శనగ పప్పు రేటు సామాన్యులను భయపెడుతోంది. నెల వ్యవధిలోనే అన్ని పప్పుల ధరలు కిలోకి రూ.20 వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరో వారంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లాలో పదేళ్లుగా అపరాల సాగు గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి పప్పులను దిగుమతి చేసుకోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెపుతున్నారు.
సబ్సిడీ ఎత్తివేసిన గత ప్రభుత్వం..
జిల్లాలో రైతులు కేవలం వరి, పత్తి, కూరగాయాల సాగుపైనే దృష్టి సారిస్తూ అపరాల సాగుకు దూరంగా ఉంటున్నారు. వర్షాధారంగా అపరాల సాగు చేయడం వల్ల అనావృష్టితో పంటలు ఎండిపోయి నష్టాల పాలవుతున్న నేపథ్యంలో రైతులు ఆ వైపు చూడడం లేదు. దీనికి తోడు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంది, పెసర, మినుము, శనగ వంటి విత్తనాలపై సబ్సిడీని ఎత్తివేసింది. అపరాల సాగుకు గత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేని కారణంగా రైతులు పప్పు పంటల సాగును పూర్తిగా వదిలేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం ఉంటే అపరాల సాగు పెరుగుతుందని అంటున్నారు.
పప్పులు కొనలేకపోతున్నాం
కంది, పెసర, మినుము పప్పుల ధరలు చూసి కొనలేకపోతున్నాం. నెల రోజుల్లోనే కిలోకు రూ.20 వరకు పెరిగింది. మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెపుతున్నారు. పప్పుకు బదులు వేరే కూరలు చేసుకుంటున్నాం.
– వి.రమేష్, నల్లగొండ
రైతులకు అవగాహన కల్పిస్తాం
జిల్లాలో పదేళ్లుగా కంది, పెసర, మినుము, శనగల వంటి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపడం లేదు. పప్పు పంటలనూ రైతుల్లో అవగాహన కల్పించి సాగును పెంచేలా చర్యలు తీసుకుంటాం. అపరాలకు కూడా మంచి మార్కెటింగ్ సౌకర్యం ఉంది. రైతులు అపరాల సాగుకు మొగ్గుచూపాలి.
పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ
ఫ పెరిగిన కంది, పెసర, మినుము,
శనగ పప్పు ధరలు
ఫ అపరాల సాగు తగ్గడమే
కారణమంటున్న వ్యాపారులు
ఫ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
2020 నుంచి జిల్లాలో అపరాల సాగు ఇలా.. (ఎకరాల్లో..)
సంవత్సరం సీజన్ కంది మినుము పెసర
2020 వానాకాలం 21,154 76 1,044
యాసంగి –– 230 757
2021 వానాకాలం 10,807 8 329
యాసంగి 28 1,214 2,213
2022 వానాకాలం 3,273 38 88
యాసంగి 5 55 1,252
2023 వానాకాలం 942 76 548
యాసంగి 354 472 1,684
హోల్‌సేల్‌గా పప్పుల ధరలు ఇలా.. (కిలోకు రూ.లలో..)
పప్పు నెలక్రితం ప్రస్తుతం
కంది 160 180
పెసర 110 130
మినుము 120 140
శనగ 70 90

