
తన ఇద్దరు కుమార్తెలు, మనుమరాలితో భారతమ్మ
నకిరేకల్: మగ దిక్కు లేని ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వ నుంచి వచ్చే పింఛన్‌తో పాటు టైలరింగ్ పని చేయడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే వారు నెలంతా గడుపుతున్నారు. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేకపోవడంతో దాతల సాయం కోసం చూస్తున్నారు. వివరాలు.. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన దుస్స లక్ష్మయ్య, భారతమ్మ దంపతులు 40 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ముంబైకి వలస వెళ్లారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె జగదీశ్వరి మానసిక వికలాంగురాలు. ముంబైలో టైలర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న లక్ష్మయ్య 36 ఏళ్ల క్రితం అక్కడే మెట్లు దిగుతూ జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత భారతమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ముంబై నుంచి నకిరేకల్‌కు తిరిగి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కూతురు పరమేశ్వరిని 20 ఏళ్ల క్రితం నకిరేకల్ మండలంలోని పన్నాలగూడెం గ్రామానికి చెందిన ముశం భద్రయ్యకి చ్చిఇ వివాహం చేసింది. వారికి ఒక కుమార్తె జన్మించింది. అయితే 5 ఏళ్ల క్రితం పరమేశ్వరి భర్త భద్రయ్య మృతిచెందాడు. దీంతో అప్పటినుంచి పరమేశ్వరి తన కుమార్తెతో పాటు వచ్చి నకిరేకల్‌లో తన తల్లి భారతమ్మ వద్దే ఉంటుంది. 5 ఏళ్ల క్రితమే నకిరేకల్ పట్టణంలోని మల్లి కార్జున కాలనీలో తమకున్న 60 గజాల స్థలంలో రేకులతో రెండు గదులు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. పరమేశ్వరి కూడా తన తల్లి నుంచి టైలరింగ్ పని నేర్చుకుని ఆమెకు చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా భారతమ్మకు వృద్ధాప్యం మీదపడటంతో ప్రస్తుతం పరమేశ్వరి మాత్రమే టైలర్ పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతోంది. పరమేశ్వరి కుమార్తె ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ప్రభుత్వం నుంచి భారతమ్మకు వృద్ధాప్య పింఛన్, పరమేశ్వరికి వితంతు పింఛన్, చిన్న కుమార్తె జగదీశ్వరికి వికలాంగుల పింఛన్ వస్తుండడంతో పాటు పరమేశ్వరి టైలరింగ్ పనిచేస్తే వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే వారి కుటుంబం గడుస్తోంది. మగ దిక్కు లేని తమ కుటుంబాన్ని డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. జగదీశ్వరి మానసిక వికలాంగురాలు కావడంతో ఆమెకు ప్రతినెలా ఆస్పత్రి ఖర్చులు అవుతున్నాయని, ఎవరైనా దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు.
ఇంటి పెద్ద మృతితో కుటుంబ భారం మోస్తున్న మహిళ
భర్త చనిపోవడంతో ఆమె వద్దే ఉంటున్న పెద్ద కుమార్తె, మనుమరాలు
చిన్న కుమార్తె..
మానసిక వికలాంగురాలు
దాతల సాయం కోసం ఎదురుచూపు
దాతలు సంప్రదించాల్సిన నంబర్
A/c. No. 62363900723
IFSC Code : SBHY0020182
Cell : 84999 24369
కుటుంబ పోషణ భారంగా మారింది
నా భర్త 36 ఏళ్ల క్రితమే చనిపోయాడు. నా పెద్ద కుమార్తెకు పెళ్లి చేస్తే ఆమె భర్త కూడా మృతిచెందాడు. దీంతో పెద్ద కుమార్తెతో పాటు మనుమరాలు కూడా నా వద్దే ఉంటున్నారు. నా చిన్న కుమార్తె మానసిక వికలాంగురాలు. ఇన్ని రోజులు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించిన నాకు వృద్ధాప్యం మీద పడడంతో నా పెద్ద కుమార్తె ఇప్పడు ఆ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. మా ముగ్గురికి ప్రభుత్వం ఇచ్చే పింఛనే ఆసరా అవుతోంది. మేము ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. దాతలు స్పందించి మా పేద కుటుంబాన్ని ఆదుకోవాలి.
– భారతమ్మ
