అంతటా వర్షం.. ఉపశమనం
నల్లగొండ, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఇప్పటివరకు వేసవి కాలం ఎండలతో అల్లాడిన ప్రజలు వర్షంతో ఒక్కసారిగా ఉపశమనం పొందారు. బుధవారం ఉదయం నుంచే అకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం వేళ జిల్లా అంతటా మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా తిరుమలగిరి సాగర్ మండంలో 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నకిరేకల్‌లో 60 మిల్లీమీటర్లు, పులిచెర్లలో 57.8, ఐటిపాములలో 47.5, అంగడిపేట, 38.8, కేతేపల్లి 37,8, నార్కట్‌పల్లి 37, హాలియా 32.5, కనగల్ 31.8, ఇబ్రహీంపేట, 30.8, రేగులగడ్డ, తుమ్మడం 26,8 ఉరుమడ్ల 24, పజ్జూరు 20.3, నెమ్మాని 19, నిడమనూర్ 18.5, గూడపూరు 17, తిమ్మాపూర్ 15,8, వెలుగుపలి కట్టంగూర్, నల్లగొండ, దామరచర్ల, గుర్రంపోడ్ ప్రాంతాల్లో 15 మిల్లీ మీటర్ల నుంచి 3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
తిరుమలగిరిలో నిలిచిన రాకపోకలు
వర్షం కారణంగా తిరుమలగిరి మండల కేంద్రం సమీపంలోని రాజవరం రోడ్డుపై ఉన్న బంధం పైనుంచి భారీగా వరద ప్రవహించింది. సుమారు మూడు గంటలకుపైగా అక్కడి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో వర్షం నీరు చేరడంతో చెరువులను తలపించాయి. అక్కడక్కడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటుకు నల్లగొండ మండలం అప్పాజిపేటలో మహిళా రైతు మృతిచెందింది. పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్దగట్టులో రెండు ఆవులు, కట్టంగూర్ మండలంలో కురుమర్తిలో రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి.
తిరుమలగిరి సాగర్‌లో అత్యధికంగా 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
చల్లబడ్డ వాతావరణం
అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లడింది. ఈ వేసవిలో చాలా రోజులు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదయ్యాయి. దీంతో జనం వేడిమితో అల్లాడారు. బుధవారం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. గరిష్ట ఉష్ణోగ్రత కూడా 36 డిగ్రీలకు పడిపోయింది.
అంతటా వర్షం.. ఉపశమనం


