
నల్లగొండ అగ్రికల్చర్ : మదర్ డెయిరీలో పనిచేస్తున్న ఆఫీస్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, హెల్పర్లకు వేతనాలను పెంచుతున్నట్లు మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఉన్న వేతనంపై ఆఫీస్ అసిస్టెంట్‌లకు రూ.1,507, టెక్నికల్ అసిస్టెంట్‌లకు రూ.2,777, హెల్పర్లకు రూ.3,012 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్‌లో పోటీ నెలకొన్న నేపథ్యంలో పాల విక్రయాలపై సిబ్బంది దృష్టి సారించాలని కోరారు.
కొనుగోళ్లు త్వరగా
పూర్తి చేయాలి
రామగిరి(నల్లగొండ) : ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. శుక్రవారం తిప్పర్తి మండలంలోని పజ్జూరులో ఐకేపీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం రైతు వేదిక వద్ద శనివారం నిర్వహించే అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
బీజేపీని
గద్దె దింపడమే లక్ష్యం
చింతపల్లి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపడమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మోద్గులమల్లేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ అమరజీవి చేపూరి బాలయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలన్నారు. ఈనెల 4న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించే సీపీఐ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, రవీంద్రచారి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్, పల్లె నర్సింహ, యుగేందర్‌రావు, పోలె వెంకటయ్య, ఆరెకంటి రాధాకృష్ణ, పాండురంగారావు, శంషొద్దీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా డిగ్రీ కాలేజీకి అటానమస్ గుర్తింపు
నల్లగొండ రూరల్ : పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ గుర్తింపు లభించింది. ప్రస్తుతం న్యాక్ ఏ గ్రేడ్‌లో కళాశాల కొనసాగింది. ఈ కళాశాలలో 2,700 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అటానమస్ హోదా వల్ల మహాత్మాగాంధీ యూనివర్సిటీతో సంబంధం లేకుండా కళాశాల అభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలు నిర్వహించడం, సిలబస్ రూపొందించుకోవడం, కొత్త కోర్సులను ప్రారంభించడంలో కళాశాలకు సొంత నిర్ణయాలు ఉంటాయి. బీఏ, బీకాం, బీఎస్పీ గ్రూపుల్లో వివిధ రకాల కాంబినేషన్లలో విద్యార్థులకు చదువుకునే సౌకర్యం ఉందని, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, హానర్స్ గ్రూప్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. మహిళా డిగ్రీ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి అటానమస్‌లో కొనసాగడం హర్షనీయమని కళాశాల ప్రిన్సిపాల్ ఘనశ్యాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు.
యాదాద్రిలో ఊంజలి సేవ
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారి ఊంజలి సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ మాఢ, తిరువీధిలో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో ఊంజలి సేవ జరిపించారు. మహిళలు మంగళ హారతులతో సేవకు స్వాగతం పలికారు. ఇక యాదాద్రీశుడికి నిత్యకైంకర్యాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వివిధ పూజల ద్వారా శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.34,12,537 సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

మాట్లాడుతున్న పల్లా వెంకట్‌రెడ్డి