
నల్గొండ : తండ్రి అకాల మృతిని జీర్ణించుకోలేకపోయిన కుమారుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జనగాం జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పటేల్‌గుడేనికి చెందిన పిక్క ఆంజనేయులు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం చేయగా, రెండవ కుమారుడు కార్తీక్(19) భువనగిరిలోని జాగృతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఆరు నెలల క్రితం తండ్రి ఆంజనేయులు గుండెపోటుకు గురై మరణించడంతో కార్తీక్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు, అప్పటి నుంచి తండ్రినే తలుచుకుంటూ కమిలిపోతూ.. చిన్న నాటి నుంచి నేటి వరకు నాన్న జ్ఞాపకాలను గుర్తుకుచేసుకుంటూ...మదన పడిపోతున్నాడు. ఇదే క్రమంలో తండ్రి లేని లోకంలో తాను ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ.. కళాశాలకు వెళుతున్నానని చెప్పి జనగాం జిల్లాలోని యశ్వంతాపూర్ వాగు వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు పట్టాలపై మృతుదేహం పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఓ ట్రేన్ డ్రైవర్ స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు.
షయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెళ్లి పంచానామా జరిపారు. మృతిని వద్ద ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ మృతితో ఆలేరు మండలం పటేల్‌గుడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నతనం నుంచి నాన్నతో ఉన్న ఆప్యాయతను తట్టుకోలేని కొడుకు మరణ వార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.