వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

రామగిరి(నల్లగొండ): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలయ్యాయి. ఆయా మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన ఔరెండి సత్యనారాయణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బ్యాంకు పని నిమిత్తం సోమవారం బైక్‌పై నల్లగొండకు బయలుదేరాడు. బైక్‌ సైడ్‌ స్టాండ్‌ తీసుకోకుండా వెళ్తుండగా మల్లేపల్లివారిగూడెం చర్చి సమీపంలో స్థానికులు చెప్పారు. బైక్‌ రన్నింగ్‌లో ఉండగానే స్టాండ్‌ తీస్తుండగా అకస్మాత్తుగా అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో సత్యానారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

అదుపు తప్పి కారుబోల్తా పడడంతో..

మద్దిరాల: నూతనకల్‌ మండలం బిక్కుమళ్ల గ్రామంలో జరుగుతున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి నలుగురు వ్యక్తులు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గోరెంట్ల శివారులోని 365 జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి హైవే కిందికి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తికి గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు.

ఆటో బోల్తా పడడంతో..

అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని ఆటో కొత్తగోల్‌తండా నుంచి ఆధ్రప్రదేశ్‌లోని కన్నెవీడు గ్రామానికి 13 మంది మిరపకాయ కూలీలతో బయల్దేరింది. మార్గమధ్యలో అనంతగిరి తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని రహదారిపై ఉన్న గుంతలో అదుపుతప్పడంతో బోల్తాకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 13 మందిలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారు బ్రేకులు పనిచేయక..

చివ్వెంల(సూర్యాపేట): మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామానికి చెందిన అన్నమనేని నవీన్‌ పని నిమిత్తం కారులో సూర్యాపేటకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో అక్కలదేవిగూడెం వద్ద కారు బ్రేకుల్‌ ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నవీన్‌ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సూర్యాపేటకు తరలించారు.

రెండు కార్లు ఢీకొని ..

పెద్దఅడిశర్లపల్లి : కొండమల్లేపల్లి మండలం ఫకీర్‌పురం గ్రామానికి చెందిన కాటి ముత్తయ్య,కాటి మురళి కుటుంబ సభ్యులు సూర్యాపేట జిల్లా ఎడబెల్లి గ్రామంలో శుభకార్యానికి వెళ్లారు. సోమవారం తిరుగు ప్రయాణమై ఇంటికి వస్తుండగా అంగడిపేట ఎక్స్‌ రోడ్‌ జంక్షన్‌ వద్దకు రాగానే పెద్దవూర నుంచి వేగంగా వస్తున్న మరో కారు ఢీకిట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.వారిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముత్తయ్య అల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top