కనగల్: బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నిర్వహిస్తున్న ర్యాలీలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. ర్యాలీగా వెళ్తున్న ముగ్గురు న్యాయకుల జేబులను కత్తిరించి రూ.76వేల నగదుతో ఉడాయించారు. కనగల్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీ కరీంపాష, రైతుసంఘం మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి నర్సిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వచ్చారు. అయితే వీరికి బీఆర్‌ఎస్ శ్రేణులు తరలివచ్చి స్వాగతం పలికి ర్యాలీ తీసారు. ఆ ర్యాలీ ఆత్మీయంగా, హడావుడిగా ముందుకు సాగుతున్న క్రమంలో దుండగులు పలువురి జేబులు కత్తింరించుకుపోయారు. ర్యాలీ నుంచి సభకు చేరుకునేలోగా వారు జేబులు చూసుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు. మందడి సైదిరెడ్డి జేబులోంచి రూ.50,000, ఎంపీపీ కరీంపాష జేబులోంచి రూ.8000, రైతుసంఘం కనగల్ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి నర్సిరెడ్డి జేబులోంచి రూ.18000నగదును దుండగులు కొట్టేసారు. నాయకుల జేబులకే దొంగలు కన్నం వేయడంతో ఒకింత అక్కడికి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఫ కనగల్‌లో ముగ్గురు నాయకుల జేబులు కత్తిరించి రూ.76వేల నగదు తస్కరణ