
చౌటుప్పల్ : గొర్రెల కళేబరాలను పరిశీలిస్తున్న జైకేసారం గ్రామస్తులు
చౌటుప్పల్ : కుక్కల దాడిలో 35గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని జైకేసారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మందుల ఐలయ్య, కోళ్ల పాపమ్మ రోజువారీగా తమ గొర్రెలను సాయంత్రం దొడ్లో తోలారు. అర్ధరాత్రి దాటాక కుక్కల దండు దొడ్లోకి వెళ్లి గొర్రెలపై దాడి చేశాయి. ఈ దాడిలో 35 గొర్లు మృత్యువాతపడ్డాయి. బాధితులు, గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పశువైద్యాధికారి పృథ్వీరాజ్ ఘటనా స్థ లానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. కాగా, గొర్రెలు మృతితో నాలుగు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని కాపరులు బోరున విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
సల్కునూరులో ఏడు మేక పిల్లలు..
వేములపల్లి : మండలంలోని సల్కునూరు గ్రామానికి చెందిన లొడంగి సైదులు మేకలను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. ఇంటి ఆవరణలో ఉన్న ఏడు మేకపిల్లలపై సోమవారం మధ్యాహ్నం కుక్కల గుంపు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. జీవనాధారమైన మేక పిల్లలు మృతిచెందడంతో ఆర్థికంగా నష్టపోయానని బాధితుడు వాపోయాడు.