రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: రాజీమార్గం ద్వారా లోక్ అదాలత్‌లో శాంతియుత వాతావరణంలో కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవచ్చని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. ఆదివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ జిల్లాలోని కోర్టులలో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 32,449 కేసులు రాజీ అయ్యాయని చెప్పారు. లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ, మోటారు వాహన యాక్సిడెంట్, భూ వివాదం, బ్యాంకు కేసులు పరిష్కరించుకున్నారని చెప్పారు. స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు జడ్జి నసీం సుల్తానా మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతారావు, కార్యదర్శి మధుసూదన్‌రావు, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


