గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కందనూలు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈటీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు సైదులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశాలు, 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
శనేశ్వరాలయానికి
భక్తుల తాకిడి
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడి ఆలయానికి పుష్యమాసం శనివారానికి పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథశాస్త్రి భక్తులతో ఏలినాటి శనిదోష నివారణకు తిలతైలాభిషేక పూజలు చేయించారు. భక్తులు సంప్రదాయ పద్ధతిలో శనేశ్వరుడికి, శివుడికి పూజలు, దర్శనాలు చేసుకున్నారు.
ప్రభుత్వం స్పందించేదాక పోరాటం
చారకొండ: గోకారం జలాశయంలో భూములు కోల్పోయిన ఎర్రవల్లి, ఎర్రవల్లితండా నిర్వాసితులు గ్రామాలు ముంపు నుంచి మినహాయించాలని చేస్తున్న రిలే దీక్షలు న్యాయమైనవని, దీనిపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగించాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషన్ సభ్యుడు ముడావత్ రాంబాల్‌నాయక్ అన్నారు. నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు శనివారం 19వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిర్వాసితులు ఉన్న ఫలంగా గ్రామాల నుంచి వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నించారు. జలాశయం సామర్థ్యం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొడంగల్ పరిధిలోని లగచర్లలో ఫార్మ కంపెనీల ఏర్పాటును ఏ విధంగా వెనక్కి తీసుకుని జీఓ విడుదల చేసిందో అలాగే గోకారం జలాశయం సామర్థ్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ


