రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
ఆహార నాణ్యతపై
విస్తృతంగా తనిఖీలు
నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమర్థవంతమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, విద్య, వైద్య, ఆరోగ్య, పీఆర్ తదితర శాఖల అధికారులతో రహదారి భద్రత కమిటీ సమావేశానికి కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు వాటిని నివారించే క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రత పరమైన అంశాలపై మరింతగా దృష్టి సారించాలని ఆదేశించారు. జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని, రహదారులు నిర్మాణాలు, మరమ్మతు చేపట్టే సందర్భంలో స్టాండర్డ్ ఆపరేషన్స్, ప్రొసీజర్‌కు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలతోపాటు పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేపట్టాలన్నారు. ప్రతి 4వ సోమవారం రోడ్ సేఫ్టీపై సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శ్రీశైలం రహదారి పరిధి అత్యంత ప్రమాదాలు జరిగే ప్రదేశంగా గుర్తించామన్నారు. ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, డీఈఓ రమేష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ రవినాయక్, డీటీడబ్ల్యూఓ ఫిరంగి, పీఆర్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు–2026పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేష్ ఎం భగవత్, జాతీయ రహదారుల, ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో కలిసి రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఇందులో కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆహార భద్రత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కొన్ని హోటళ్లు నాన్ వెజ్, వెజిటేరియన్ ఆహార పదార్థాలు కలిపి తయారు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిపై ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నారు. అలాగే జిలాల్లోని 157 ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను పరిశీలించాలన్నారు. వచ్చే సమావేశం నాటికి జిల్లాలో ఎన్ని హోటళ్లకు లైసెన్సులు ఉన్నాయి.. ఏయే స్థాయిలో ఉన్నాయో పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించారు.


