విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఎస్‌కే మహమూద్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని పంజుగుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా విధానం కొనసాగుతున్న తీరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన ప్రాముఖ్యత పనితీరు తదితర విషయాలను పరిశీలించారు. పాఠశాల స్థాయిలో వృత్తి విద్యా కోర్సుల ఏర్పాటుపై ఉపాధ్యాయులతో చర్చించారు. జాతీయ విద్యా విధానం, రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రాముఖ్యత 2020 జాతీయ విద్యా విధానంలో ఉన్న అంశాలను ప్రస్తుత పాఠశాలకు ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది అనే విషయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు ఉండకూడదని అభిప్రాయపడ్డారు.


