మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: జిల్లాలో మొదటి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీసీ నిర్వహించి సూచనలు చేశారు. కలెక్టరేట్ నుంచి సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్, అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి వీసీలో పాల్గొని మాట్లాడారు. పోలింగ్ రోజు ఉదయం 9, 11, ఒంటిగంటకు అందించే పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌తోపాటు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, రూట్ ఆఫీసర్లు జోనల్ ఆఫీసర్లు, పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియలను అత్యంత సజావుగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లతోపాటు అవసరమైన చోట్ల పోలీస్ పహారా కొనసాగిస్తామన్నారు. సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు అత్యంత సజావుగా జరిగేలా ప్రతి ఎన్నికల పోలింగ్ సిబ్బందికి పకడ్బందీగా శిక్షణ ఇవ్వడంతోపాటు పోలింగ్ ప్రక్రియలో చేపట్టే ప్రతి అంశాన్ని వివరించామన్నారు. సమావేశంలో వ్యయ పరిశీలకులు భీమ్లానాయక్, డీపీఓ శ్రీరాములు, ఎన్నికల నోడల్ అధికారులు భాస్కర్, సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆరు మండలాల్లో నిషేధాజ్ఞల అమలు
తొలి విడత ఎన్నికలు జరిగే కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా మండలాల్లో ఇక నుంచి ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఆ తర్వాత ఎలాంటి ఊరేగింపులు చేయకూడదని కలెక్టర్ పేర్కొన్నారు.


