వారసత్వానికి ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహం
నాగర్‌కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభ పరిణామని, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ గోపిడి అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఐక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ తల్లి నిలుస్తుందని, భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను చేరవేయడానికి ఈ విగ్రహం దోహదపడుతుందన్నారు. తెలంగాణ స్ఫూర్తి తరతరాలపాటు వికసించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు


