దారి తప్పిన సంగ్రామం..!
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తిప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వీధికి వెళ్లేందుకు వేసిన మట్టి రోడ్డు ఇది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో 2019లో ఊరంతా ఏకమై ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ నిధులు వస్తే గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని ఆశించారు. నజరానా రాకపోవడంతో సాధారణంగా వచ్చే నిధులతో తూతూమంత్రంగా పనులు చేపట్టారు. ఇప్పటికీ పలు వీధుల్లో సీసీరోడ్లు, పంచాయతీకి సొంత భవనం లేదు. అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన పాత భవనంలోనే కొనసాగుతోంది.
..ఈ ఒక్క గ్రామమే కాకుండా.. ఉమ్మడి పాలమూరులోని అన్ని ఏకగ్రీవ పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పారితోషికం రాక.. నిర్దేశించుకున్న పనులు కాక.. స్థానిక ప్రజల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ట్రెండ్ మారి వేలం పాటల ద్వారా ఏకగ్రీవాలకు క్రేజ్ పెరుగుతుండగా.. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయి. యునానిమస్ లక్ష్యం నెరవేరకపోవడం.. దారి తప్పుతున్న సం‘గ్రామం’ తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్
ఉవ్ముడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో గత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 322 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 113, నాగర్‌కర్నూల్‌లో 80, జోగుళాంబ గద్వాలలో 48, వనపర్తిలో 45, నారాయణపేట జిల్లాలో తక్కువగా 36 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలన్నింటినీ గ్రామస్తులంతా ఒక్కతాటికి వచ్చి ఏకగ్రీవం చేసుకున్నారు. ఆలయ నిర్మాణాల వంటి ప్రధాన పనులు పూర్తి చేస్తామంటూ పలు జీపీల్లో ముందుకు రాగా.. ఆ అభ్యర్థులకు సర్పంచ్ అవకాశం ఇచ్చారు. కానీ, పెద్దగా వేలం పాటలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆయా ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది.
● జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని చింతకుంట గ్రామాన్ని ఏకగ్రీవం చేసేందుకు కొందరు గ్రామపెద్దలు యత్నించారు. రూ.38.50 లక్షలకు ఏకగ్రీవం చేస్తూ.. సదరు అభ్యర్థి మినహా ఎవరూ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని గ్రామానికి చెందిన ఒకరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. విచారణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
● నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు పెద్దలు తీర్మానించగా బెడిసి కొట్టింది. రూ.25 లక్షలు ఇస్తానని ఒకరు ముందుకు రాగా.. ఓ అభ్యర్థి వ్యతిరేకించారు. దీంతోపాటు తన నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ.5 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టడమే కాకుండా బెదిరిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. దీనిపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేశారు.
మచ్చుకు
కొన్ని..
మారిన ట్రెండ్..
డబ్బున్నోళ్లకే చాన్స్?
ప్రస్తుత జీపీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ట్రెండ్ మారింది. పలు పంచాయతీల్లో పోటీచేసే ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారులతో గ్రామాల పెద్దలు భేటీ ఏర్పాటు చేసి.. ఎవరు ఎంత ఇస్తారంటూ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి దశలో 550 గ్రామాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 44 జీపీలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మెజార్టీ చోట్ల వేలం పాటల ద్వారానే సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసేలా పెద్దలు చక్రం తిప్పారు. కొన్నిచోట్ల సర్పంచ్ స్థానాల్లో వేలం పాడి పోటీ లేకుండా ఒక్కరితోనే నామినేషన్లు వేయించారు. ఇలా ఒక్కరే నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువగా రియల్టర్లు, బడా వ్యాపారులే ఉండడం గమనార్హం.
దాదాపు 88 శాతం మేర..
ఉమ్మడి జిల్లాలో తొలిదశ ఎన్నికల్లో 44 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 39 గ్రామాల వరకు వేలం ద్వారా పదవులకు తీర్మానం చేసి.. ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేసేలా పెద్దలు చక్రం తిప్పినట్లు
నిబంధనలు కఠినం..
కొన్ని ప్రాంతాల్లో వేలం పాటల ద్వారా గ్రామాలను ఏకగ్రీవం చేస్తున్నారనే అంశం ఎన్నికల కమిషన్ దృష్టికి రావడంతో నిబంధనలను మరింత కఠినం చేసింది. నిబంధనల ప్రకారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏకగ్రీవమైన జీపీల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రాజకీయ నేతల ప్రోద్బలంతో ఉపసంహరించుకున్న వారు మిన్నకుండిపోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలం ద్వారా పదవులు పొందిన వారిపై చర్యలుంటా యా అనేది ప్రశ్నార్థకమేనని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ ‘పెద్దల’ చేతుల్లోకి సమస్త గ్రామవాసుల నిర్ణయాధికారం
రియల్, వ్యాపార రంగాలకు చెందిన యువతకే గ్రీన్‌సిగ్నల్
భారీ మొత్తం చెల్లించలేక ఔత్సాహికుల వెనకడుగు
పల్లెపోరు పెడదారి పట్టడంతో పలుచోట్ల ‘పంచాయితీ’
యునానిమస్ లక్ష్యం నెరవేరకపోవడమూ కారణమంటున్న మేధావులు
దారి తప్పిన సంగ్రామం..!
దారి తప్పిన సంగ్రామం..!
దారి తప్పిన సంగ్రామం..!


