కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
వెల్దండ: కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండ మండలం తిమ్మినోనిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి శారద, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, శేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, హరికిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వసతుల కల్పనలో విఫలం
అచ్చంపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణలో సరైన వసతులు కల్పించకపోడంతో ఇబ్బందులకు గురయ్యారన్నారు. వంగూరు, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో నిర్వహించిన శిక్షణకు హాజరైన ఉద్యోగులు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా సమకూర్చలేదన్నారు. 50 మందికి పైగా నిలబడే శిక్షణలో పాల్గొన్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మైసమ్మ దేవతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కొత్త వాహనాలకు మైసమ్మ సన్నిధిలో పూజలు చేశారు. భక్తులతో జాతర మైదానం కిటకిటలాడింది. భక్తుల సౌకర్యార్థం నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు.
‘ఇన్ సర్వీస్ టీచర్లకు
టెట్ రద్దు చేయాలి’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దుచేయాలని టీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతోపాటు పీఆర్‌సీ అమలుతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం సంఘం జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా తాహెర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హమీద్‌అలీ, కార్యదర్శి మహమ్మద్ రహమతుల్లా, జిల్లా అధ్యక్షుడు సతీష్‌కుమార్, నాయకులు షేక్‌ఫరీద్, శశిధర్, మల్లికార్జున్, మోహన్, శరణప్ప, మురళి, శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు.
ఉచిత శిక్షణ ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఉచిత సైకాలజీ శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ మేరకు నారాయణపేట డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ టెట్ అర్హత పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తరగతులను ఉచితంగా బోధించేందుకు అధ్యాపకుడు జనార్దన్‌రెడ్డి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మొత్తం 70కిపైగా అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి


