విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి
లింగాల: ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కుమార్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం, మండలంలోని అంబట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోమటికుంట, దత్తారం, శాయిన్‌పేట పాఠశాలలను డీఈఓ ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా విద్యాలయం, అంబట్‌పల్లి ఉన్నత పాఠశాలలో ఇంటర్, పది విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు రెగ్యూలర్ తరగతులే గాక ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పలు పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరిన విషయం గుర్తించామని, కొత్త భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బషీర్‌అహ్మద్, జీఈసీఓ శోభారాణి, హెచ్‌ఎం నిరంజన్, ఎస్‌ఓ శారద ఉన్నారు.


