కాంగ్రెస్‌లో లుకలుకలు..!
అమాత్యుల ఇలాకాల్లో ‘అంతర్గత’ పోరు
● మక్తల్‌లో తారస్థాయికి ‘కోటరీ’ లొల్లి
● ‘మద్దతు’ నేతలతో మంత్రికి పెరిగిన దూరం
● పట్టించుకోవడం లేదంటూ సెకండ్ కేడర్ కినుక
● సీఎం రేవంత్ సభపై ‘అసమ్మతి’ ప్రభావం?
● శ్రీహరి నారాజ్‌తో
వెలుగులోకి విభేదాలు
● ‘కొల్లాపూర్’లో సైతంఇలాంటి పరిస్థితులే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘మక్తల్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి అడుగులు వేయించిన సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన సమయంలో పెద్ద మనసుతో ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచ్చినా బాధపడలేదు. నన్ను వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసినా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మీ ప్రవర్తనతో మనసు గాయపడింది. ఈ తప్పు మరోసారి చేయకండి.’’
..నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన ప్రజాపాలన–విజయోత్సవాల సభలో మంత్రి వాకిటి శ్రీహరి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు ఇవి. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన ఇలా నారాజ్ వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మక్తల్ కాంగ్రెస్‌లో లుకలుకలు వెలుగుచూస్తున్నాయి. పలువురు నేతల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. మరో మంత్రి జూపల్లి సొంత ఇలాకా కొల్లాపూర్‌లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక కోటరీ.. దూరంగా నేతలు
2023 ఎన్నికల సమయంలో మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరితో పాటు బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, నాగరాజుగౌడ్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడ్డారు. అధిష్టానం వాకిటి వైపే మొగ్గుచూపగా.. ఓట్లు చీలొద్దనే ఉద్దేశంతో మిగిలిన వారు ఏకమై ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా శ్రీహరి గెలుపొందిన తర్వాత కూడా కొన్ని నెలలపాటు వారందరూ ఐక్యంగానే ఉన్నారు. ఆ తర్వాత పలువురితో ఆయన అంటీముట్టనట్లు వ్యవహరించడంతో వారి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. మంత్రి అయిన తర్వాత గెలుపునకు సహకరించిన వారిలో ఓ వర్గం ప్రత్యేక కోటరీగా ఏర్పడగా.. మిగిలిన నేతలతో శ్రీహరికి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. కనీసం కలవలేని పరిస్థితుల్లో ఆయా నేతలు ఆయనకు దూరంగా ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
అగ్గి రాజేసిన ఆ లేఖలు..
రాష్ట్రంలో అధిక సంఖ్యలో ముదిరాజ్‌లకు న్యాయం చేసేలా రాష్ట్ర కేబినెట్‌లో ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు అవకాశం కల్పించనున్నట్లు ఎంపీ ఎన్నికల సమయంలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఏకై క ముదిరాజ్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కాగా.. ఆయనకే అవకాశం దక్కింది. అయితే మంత్రివర్గంలోకి ఆయనను తీసుకునేందుకు కొన్ని నెలలు పట్టింది. ఈ సమయంలో ‘ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.. మిగతా వారిని పట్టించుకోవడం లేదు’ అంటూ వాకిటి శ్రీహరిపై పలు లేఖలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. ఇవే శ్రీహరికి, పలువురు నేతల మధ్య అగ్గి రాజుకునేలా చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వారి మధ్య అంతరం పెరుగుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.
‘కొల్లాపూర్’లో సైతం..
రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో సైతం అసమ్మతి నెలకొన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా ఆయనతో పాటు చింతలపల్లి జగదీశ్వర్‌రావు కాంగ్రెస్ టికెట్ ఆశించారు. పార్టీ అధిష్టానం జూపల్లికే అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో తొలుత జగదీశ్వర్‌రావు తాను ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉండి సేవలందిస్తున్నానని.. పార్టీ నుంచి వెళ్లి మళ్లీ వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అధిష్టానం నచ్చజెప్పడంతో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో పాటు ఆయన అనుచరులకు ప్రాధాన్యం దక్కకపోవడంతో జగదీశ్వర్‌రావు అసంతృప్తితో ఉన్న ట్లు సమాచారం. మరోవైపు ఇటీవల ఆయన అనుచరులతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.


