అభ్యర్థులను బెదిరిస్తే కఠిన చర్యలు
వెల్దండ: స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులను ఏకగ్రీవం కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాయఘపల్లి గ్రామాన్ని వారు సందర్శించారు. గ్రామ పంచాయతీని ఎస్సీ జనరల్‌కు కేటాయించగా.. సామ రామచంద్రయ్య, బర్కం గణేష్, సామ వెంకటయ్య, బర్కం యాదయ్య, కమల్ల కొండల్, సామ రాజు నామినేషన్ వేశారు. అయితే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు బహిరంగ వేలం నిర్వహించి సామ వెంకటయ్య గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు రూ.25 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పోటీలో ఉన్న ఆరుమంది సర్పంచ్ ఏకగ్రీవం చేసేందుకు సుముఖత వ్యక్తం చేయగా బర్కం గణేష్ తిరస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కొంతమంది అతన్ని బెదిరింపులకు పాల్పడి, కొంత నగదు ఇస్తామని ఆశచూపినట్లు బాధితుడు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలు పెట్టారు. దీంతోపాటు ఎన్నికల కమిషన్, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, వెల్దండ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి మండల అధికారులతో కలిసి గ్రామానికి చేరుకుని సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం తగదన్నారు. ఇకపై గణేష్‌ను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయబోమని తీర్మానం చేసి సంతకాలు చేశారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, సూపరింటెండెంట్ మోహన్‌లాల్, ఎంపీఓ లక్ష్మణ్, కార్యదర్శి ప్రేమలత, ఆర్‌ఐ శంకర్, జీపీఓ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కోడ్ ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు నమోదు
రాఘాయపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ప్రచారం చేసిన సామ వెంకటయ్యపై ఫ్లయింగ్ స్క్వాడ్ చిందానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. గ్రామంలో డబ్బు ప్రచారం చేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


