నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ
నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు లోబడి జిల్లాలో మొదటి, రెండో విడతలో 13 మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి మొదటి, రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ సాధారణ పరిశీలకులు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయం పర్యవేక్షణలో ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ చేపట్టారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 6 మండలాల్లోని 1,326 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే 3,502 మంది పీఓ, ఓపీఓలను, రెండో దశ ఎన్నికలకు 7 మండలాల్లోని 1,412 పోలింగ్ కేంద్రాలకు గాను 4,106 మందిని నియమించామన్నారు. ప్రతి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు 20 శాతం అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. సిబ్బందికి ఎన్నికల నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామని వివరించారు.
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
తెలకపల్లి: రాబోయే పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన తెలకపల్లి, పెద్దపల్లి, ఆలేరు, పెద్దూరు గ్రామాల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి.. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఇందుకోసం ముందు నుంచే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని చెప్పారు. మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, ఇతర ఆహార పదార్థాలు పరిశీలించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు అనువైన వాతావరణం కల్పించాలని చెప్పారు.
నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ


