సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
కందనూలు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జి పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫ్రాడ్‌కో పుల్‌స్టాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఫ్రాడ్‌కో పుల్‌స్టాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రోగ్రాం ఆరు వారాలలో ఆరు విభిన్న అంశాలపై నిర్వహిస్తారని, ఈ కార్యక్రమం మంగళవారం నుంచి వచ్చే నెల 12 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేయడం అత్యంత ముఖ్యమన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే అంశం పోలీస్ శాఖలో లేదని, అలా వచ్చే కాల్స్ మోసపూరితమైనవని గుర్తించాలని చెప్పారు. అలాగే ఏఐ టూల్స్ ఉపయోగించి ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తారని, అలాంటి పరిస్థితులకు గురైతే ఎలాంటి భయానికి లోనవకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. బ్యాంకులు ఓటీపీల కోసం ఫోన్ చేయవని, అలాంటి కాల్స్‌కు స్పందించకూడదన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు మొదట లాభం చూపి తర్వాత పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసం చేస్తాయని, అలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ ఉపేందర్‌రావు, జిల్లా సైబర్ క్రైం టీం, పాలెం యూనివర్సిటీ ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.


