నేడు డయల్ యువర్ డీఎం
కందనూలు: నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు ఆదివారం డయల్ యువర్ డీఎం నిర్వహించనున్నట్లు డీఎం యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సెల్ నంబర్ 99592 26288లను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతోపాటు ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయాలని కోరారు.
హెచ్‌ఎంలకు
షోకాజ్ నోటీసులు
కందనూలు: పాఠశాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన పలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు డీఈఓ రమేష్‌కుమార్ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని కొట్ర, కొల్లాపూర్, మంతటి, పాలెం, బాలుర పెంట్లవెల్లి, వంకేశ్వరం, మార్చాల, సిర్సవాడ, తెలకపల్లి, కార్వంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలు పాఠశాలల్లో నిర్వహించే ఎఫ్‌ఎల్‌ఎన్, లిప్ కార్యక్రమాలు సరైన పద్ధతిలో చేయకపోవడంతో వాటిని పర్యవేక్షించే స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు నిర్లక్ష్యం వహించారని డీఈఓ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్యవేక్షణ ఎందుకు చేయలేదో నోటీసులు అందిన రెండు రోజుల్లో లిఖిత పూర్వకంగా తమ కార్యాలయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన
వైద్యం అందించాలి
లింగాల: వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని అంబట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి.. పీహెచ్‌సీ నిర్వహణ రికార్డులు, మందులను పరిశీలించారు. ప్రతిరోజు ఓపీ ఎంత అవుతుంది.. అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. పీహెచ్‌సీ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఏఎన్‌ఎంలు ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రిలో వైద్యులతోపాటు మరికొంత మంది వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంట వైద్యాధికారి దశరత్, హెచ్‌ఏ రామచందర్, ఫార్మసిస్టు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి మద్దిమడుగులో దీక్షమాల ఉత్సవాలు
అమ్రాబాద్: నల్లమలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దీక్ష మాల విరమణ బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి గురువారం వరకు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నిత్యార్చన, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, సోమవారం విఘ్నేశ్వరపూజ, పంచగవ్యం, వాస్తుపూజ హోమం, రుద్రహోమం, సహస్రనామర్చన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, నిత్యౌపాసన, మన్యుసూక్తహోమం, బలిహరణ, తీర్థ ప్రసాద వితరణ, రాత్రికి అమ్మవారి సేవ, మంగళవారం విఘ్నేశ్వర పూజ, గవ్యాంతపూజ, రుద్రహోమం, నిత్యౌపాసన, బలిహరణ, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పం, రాత్రికి శివపార్వతుల కల్యాణం ఉంటుంది. బుధవారం విఘ్నేశ్వరపూజ, గవ్యాంతరపూజ, రుద్రహోమం, నిత్యౌపాసన, హనుమత్ వ్రతం, తీర్థ ప్రసాద వితరణ, రాత్రికి సీతారాముల కల్యాణం జరిపిస్తారు. గురువారం చివరి రోజు గవ్యాంత పూజ, 108 కళశాలతో మహాకుంబాభిషేకం, హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈఓ తెలిపారు. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకొని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు డయల్ యువర్ డీఎం


