ముగిసిన తొలి విడత నామినేషన్లు
● చివరిరోజు బారులుదీరిన అభ్యర్థులు
● ఊర్కొండ, వంగూరులో శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ
సాక్షి, నాగర్‌కర్నూల్: తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు పూర్తి కాగా.. అప్పటికే క్లస్టర్ కేంద్రాల వద్ద లైన్‌లో ఉన్న అభ్యర్థుల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు. చివరిరోజున భారీ ఎత్తున నామినేషన్లతో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు పోటెత్తారు. శనివారం కల్వకుర్తి మండలంలో సర్పంచ్ స్థానాలకు 86 నామినేషన్లు, వార్డు స్థానాలకు 503 నామినేషన్లు వచ్చాయి. అలాగే తెలకపల్లి మండలంలో సర్పంచ్ 181, వార్డు స్థానాలకు 522, తాడూరు మండలంలో సర్పంచ్ 102, వార్డు స్థానాలకు 476, వెల్దండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 149, వార్డు స్థానాలకు 574 నామినేషన్లు వచ్చాయి. అలాగే ఊర్కొండ, వంగూరు మండలాల్లో అర్ధరాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు.
వెల్దండ మండలం బైరాపూర్‌లో నామినేషన్లు దాఖలు
చేసేందుకు నిల్చున్న అభ్యర్థులు
తొలివిడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగియగా.. ఐదు చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సీఎం స్వగ్రామం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లెలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే వెల్దండ మండలంలోని బండోనిపల్లి, కేస్లీతండా సర్పంచ్ స్థానాలతో వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెలకపల్లి మండలంలోని గట్టురాయిపాకుల, తాళ్లపల్లి గ్రామాల్లో ఒక్కొక్కరి నుంచే నామినేషన్లు రావడంతో ఈ గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ తండా సర్పంచ్‌గా ఇస్లావత్ లక్ష్మి నామినేషన్ ఒక్కటే రావడంతో ఈ గ్రామం ఏకగ్రీవమైంది.
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. రెండో విడతలో భాగంగా ఏడు మండలాల్లో ఎన్నికలను నిర్వహించనుండగా.. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని 151 సర్పంచ్ స్థానాలతోపాటు 1,412 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను డిసెంబర్ 2 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. 6న ఉపసంహరణ, 14న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ముగిసిన తొలి విడత నామినేషన్లు


