ఉద్యమాలు, త్యాగాల ఫలితమే తెలంగాణ
నాగరకర్నూల్/ నాగర్‌కర్నూల్ క్రైం: ఉద్యమాలు, త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్ష దివస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే నినాదంతో 29 నవంబర్ 2009లో కేసీఆర్ 11 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు శ్రీకారం చుట్టిందన్నారు. నీరు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజల హక్కుగా భావించి సాగించిన ఉద్యమం కేసీఆర్ సారథ్యంలోనే సాగిందన్నారు. మలిదశ ఉద్యమానికి నాయకుడిగా ముందుకు సాగిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా.. ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమంతో ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి చరిత్రలో కేసీఆర్ పేరును చెరిపేయడానికి కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప ధీరుడు కేసీఆర్ అన్నారు. అంతకు ముందు నల్లవెల్లి కూడలిలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నాయకులు బైకాని శ్రీనివాస్‌యాదవ్, గంగనముని కుర్మయ్య, నాగం శశిధర్‌రెడ్డి, పోకల మనో హర్, ఎడ్మ సత్యం, తులసీరాం, అర్థం రవి, ప్రదీప్, నర్సింహగౌడ్, వేణుగోపాల్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


