తడిసి మోపెడు..
‘‘అన్నా.. సర్పంచ్ ఎన్నికలు వచ్చినయ్. నామినేషన్లు కూడా మొదలైనయ్. మీ ఊరికి మొదటి విడతలోనే అవుతున్నయ్. తొందరగా గడిచిపోతుంది. మా ఊరికి మాత్రం మూడో విడతలో ఎన్నికలు ఉన్నయి. ఇంకా 20 రోజుల టైం ఉంది. అప్పటిదాక ఓటర్లను ఎట్ల ‘మేనేజ్’ చేసుకునుడో. రోజురోజుకు ఎంత ఖర్చు అయితదో. ఇప్పటికే సిద్ధం చేసుకున్న డబ్బులు సరిపోతయో లేదో..’ ఇదీ మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు ఉన్న ఓ సర్పంచ్ అభ్యర్థి ఆందోళన. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల ముచ్చటే వినిపిస్తోంది. చివరి విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామాల అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై ఆలోచనలో పడ్డారు.
సాక్షి, నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికలకు కీలకమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఆశావహులు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకుంటూ.. ఓటర్ల మెప్పు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 3న, రెండో విడత 14న, మూడో విడత ఎన్నికలు 17న నిర్వహించనున్నారు. తుది విడత పంచాయతీ ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం ఉండటంతో అప్పటిదాకా ఓటర్లను ఎలా అట్టిపెట్టుకోవాలా? అన్న ఆలోచనలో పడ్డారు. రోజురోజుకూ పోల్ మేనేజ్‌మెంట్ ఖర్చులు పెరుగుతుండటం.. సుదీర్ఘకాలం పాటు ఓటర్లను మేనేజ్ చేయాల్సి ఉండటంతో ఆయా గ్రామాల అభ్యర్థుల్లో దిగులు నెలకొంది.
ఈసారి సడలింపుతోపెరిగిన పోటీ..
గతంలో స్థానిక సంస్థల్లో పోటీచేసేందుకు ముగ్గురు పిల్లలు ఉన్న వారు అనర్హులు. 1994 తర్వాత ముగ్గురు పిల్లలు జన్మిస్తే.. వారంతా స్థానిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న పద్మావతి ముగ్గురు పిల్లల నిబంధన కారణంగా కోర్టు జోక్యంతో జెడ్పీటీసీ స్థానానికి అనర్హురాలిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం ముగ్గురు పిల్లల నిబంధనను సడిలించింది. దీంతో గ్రామాల్లో పోటీదారుల సంఖ్య కూడా పెరిగింది. చాలావరకు గ్రామాల్లో అదనంగా ఒకరు, ఇద్దరు అభ్యర్థులు పెరుగుతున్నారు.
సర్పంచ్ ఎన్నికలకు భారీగా పెరుగుతున్న ఖర్చు
మూడో విడత పంచాయతీ పోరుకుఇంకా 20 రోజులు
అప్పటివరకు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే..
అభ్యర్థుల్లో గుబులు


