సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నిఘా
నాగర్‌కర్నూల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై ప్రత్యేకంగా నిఘా ఉంచనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌ను అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోజువారీ దినపత్రికలు, వివిధ టీవీ ఛానల్స్‌తో పాటు లోకల్ ఛానల్స్‌ను పకడ్బందీగా పర్యవేక్షించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. అనంతరం హెల్ప్‌లైన్ సెంటర్‌ను ప్రారంభించారు. నిరంతరం 08540–230201 నంబర్ అందుబాటులో ఉంటుందని.. ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. హెల్ప్‌లైన్ సెంటర్ సిబ్బంది దృష్టికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సిబ్బంది రాము, శివ, వెంకటయ్య పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
తెలకపల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపట్టిన నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని.. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి తెలకపల్లి, గౌరెడ్డిపల్లి నామినేషన్ కేంద్రాలను ఆయ న పరిశీలించారు. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులకు అప్పగించిన ఎన్నికల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రం వద్ద గ్రామాల వారీగా రిజర్వేషన్ల జాబితా ఏర్పాటు చేయాలని సూచించారు. తెలకపల్లి మండలంలోని 7 క్లస్టర్ల పరిధిలో 28 జీపీల సర్పంచ్, 260 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. వారి వెంట తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంపీడీఓ తరుణ్, ఎంపీఓ వెంకటయ్య, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ నరేశ్ ఉన్నారు.


