ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
కందనూలు: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మూడు కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. ఈ పరీక్షకు 747 మంది విద్యార్థులకు గాను 706 మంది హాజరయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఈఓ రమేశ్‌కుమార్, సూపరింటెండెంట్ నాగేంద్రం పరిశీలించారు.
సత్యసాయి సేవలు
స్ఫూర్తిదాయకం
కందనూలు: మానవ సేవే.. మాధవ సేవని నమ్మి సత్యసాయిబాబా అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీసత్యసాయి మందిరంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యసాయి సేవాసమితి, శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు దుస్తులు, దుప్పట్లు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, చారిటబుల్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు హకీం మురళి, ప్రధాన కార్యదర్శి ఏలిమె ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు నల్లమలకు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
అచ్చంపేట: నల్లమలలోని భౌరాపూర్ చెంచుపెంటలో సోమవారం నిర్వహించే భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. ఆదివారం అచ్చంపేటలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిర్సా ముండా వీరోచిత పోరాటం, విలక్షణ నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ‘జనజాతి గౌరవ దివస్’గా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ.. గిరిజనుల గౌరవాన్ని పెంచిందన్నారు. ప్రధానమంత్రి జన్‌మన్ కార్యక్రమం ద్వారా నల్లమలలోని ఆదివాసీలకు పర్యావరణ గృహాలు మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లాలో తొలిసారిగా పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదివాసీల నూతన గృహాలను సందర్శిస్తారని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు మంగానాయక్, ఆంజనేయులు, రాములు, నాగయ్యగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, చందూలాల్, శివచంద్ర, రాకేశ్, శివ పాల్గొన్నారు.
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాత రకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి.. మైసమ్మ దేవతను దర్శించుకున్నారు. పచ్చిపులుసు అన్నంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దాదాపు 12వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు ఎండోమెంట్ అధికారి రామేశ్వర్ శర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు.
ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష


