
మార్కెట్‌లో తడిసిన మొక్కజొన్న ధాన్యం
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో విక్రయానికి వచ్చిన మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దయ్యింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చినా రైతులకు కష్టాలు తప్పలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసిన ధాన్యాన్ని మార్కెట్‌యార్డులో ఆరబోస్తుండగా.. బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా జల్లులు కురవడంతో మళ్లీ తడిసిపోయింది. రైతులు హడావుడిగా కవర్లు కప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా, వారం రోజులుగా ఆరబెట్టుకున్న మొక్కజొన్నలను అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉందని ట్రేడర్లు ముందుకు రావడం లేదని వాపోయారు. తడిసిన మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.